ఎస్వీఆర్.. నటనకే డిక్షనరీ

ఎస్వీఆర్.. నటనకే డిక్షనరీ

స్వరంలో గాంభీర్యం.. మాటల్లో స్పష్టత. డైలాగ్ విరవడంలో..అభినయంలో ఎస్వీఆర్‌కు ఆయనే సాటి. కంటిచూపుతో మాట్లగలరు. కనురెప్పల కదలికలతోనే ఎమోషన్స్​ని పండించగలరు.  ఏ పాత్ర అయినా..  అందులో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మహానటుడు యస్వీ రంగారావు. ముఖంలో మెరుపు.. మాటలో విరుపు.. ఏం చేసినా ఆయనదే గెలుపు. నటనకు డిక్షనరీ అంటూ ప్రపంచం పొగిడే విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆ మహానటుణ్ని మరోసారి మనసారా తలుచుకుని నివాళులు అర్పిద్దాం..

తొలి అడుగులు
తెలుగు చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన ఎందరో మహానటుల్లో ఎస్వీ రంగారావు అగ్రగణ్యులు.  ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918లో కృష్ణా జిల్లా, నూజివీడులో పుట్టారు. తాతగారు కోటయ్య నాయుడు డాక్టర్. మేనమామ రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగి. నాన్నకి తరచూ ట్రాన్స్ఫర్లు అవుతుండేవి. దాంతో ఆయన్ని వాళ్ల నాయనమ్మ దగ్గర పెట్టి చదివించారు. తాతగారు చనిపోయాక మనవలు, మనవరాళ్లతో సహా అందరినీ తీసుకుని మద్రాస్ చేరుకుంది నాయనమ్మ.  దీంతో మద్రాస్  హిందూ హైస్కూల్లో రంగారావు చేరారు . అక్కడ చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండేవి. తన పదిహేనో యేట ఓ నాటకంలో  రంగారావు నటించారు. అందరూ మెచ్చుకోవడంతో నటనపై అలా ఆసక్తి కలిగింది. స్కూల్లో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో కనిపించేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిక్ కూడా ఆడేవారు.  కానీ నటన స్పెషల్‌గా అనిపించేది. మద్రాస్‌లో ఎక్కడ తెలుగు నాటకాలు ప్రదర్శించినా అక్కడికి వెళ్లేవారు. అన్ని భాషల సినిమాలూ చూసేవారు.  ఆ ఇష్టం అలా పెరుగుతూ వచ్చింది. ఓసారి బళ్లారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు వంటి వారి నాటకాలు చూసి ..ఇక యాక్టర్ అవ్వాలని బలంగా ఫిక్సైపోయారు. మద్రాస్‌లో SSLC,  వైజాగ్‌లో ఇంటర్, కాకినాడలో BSC పూర్తి చేసినా నటుణ్ని కావాలనే కోరిక మాత్రం లోపల తొలిచేసేది.  

కల నిజమాయె..
కాకినాడలో బీఎస్సీ చదివే సమయంలో స్థానికంగా ఉన్న ఓ క్లబ్‌లో చేరిన ఎస్వీఆర్ ఎన్నో నాటకాలు వేశారు. అక్కడే రేలంగి, అంజలీదేవి, బీఏ సుబ్బారావు, ఆదినారాయణరావు వంటి వారు ఆయనకు పరిచయమయ్యారు. నటనను చాలా సీరియస్‌గా తీసుకున్న రంగారావు అడపా దడపా ఏదో ఒక నాటకంలో కనిపిస్తూనే ఉండేవారు. ఇంగ్లిష్ మీద కూడా పట్టు ఉండటంతో షేక్‌స్పియర్ నాటకాల్లోని పాత్రలు సైతం వేసేవారు. బీఎస్సీ పూర్తయ్యాక ఎమ్మెస్సీ చేద్దామనుకున్నారు కానీ.. ఫైర్ డిపార్ట్మెంట్లో  ఉద్యోగం రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. మొదట బందర్‌‌లో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్‌‌గా పని చేశారు. దాంతో తీరిక దొరికినప్పుడల్లా నాటకాల్లో బిజీ అయిపోయేవారు. ఒకోనొక సమయంలో  కళకి దూరమవుతున్న ఫీలింగ్ రావడంతో ఎస్వీఆర్ ఉద్యోగాన్ని వదిలేశారు. ఇంతలో తన దూరపు బంధువైన బీవీ రామానందం రంగారావు  ..తాను తీసే ‘వరూధిని’ చిత్రంలో నటించమని రంగారావును అడిగారు. అన్నది తడువుగా వెంటనే ఓకే చెప్పేశారు.  అయితే ఒక్కడ ఎస్వీఆర్కు  ఓ సమస్య వచ్చింది. నాటకాల్లో ఆడవాళ్ల పాత్రల్ని కూడా మగాళ్లే వేసేవారు. కానీ సినిమాల్లో ఆడవాళ్లతో కలిసి నటించాల్సి రావడంతో ఆయన చాలా ఇబ్బంది పడిపోయారట.  దర్శకుడు సర్ది చెప్పడంతో మొత్తానికి ధైర్యంగా చేయగలిగారు. 

సినిమా కెరియర్లో మలుపు
‘వరూధిని’ సినిమా చేసేటప్పుడు సినిమాల్లోకి వెళ్లాలన్న తన కల నెరవేరినందుకు ఎస్వీఆర్ చాలా సంతోషపడ్డారు.  ఆ చిత్రానికి 750  రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. అయితే మూవీ ఫ్లాపవ్వడంతో ఆయన ఆనందం ఆవిరైపోయింది.  చాలా రోజుల వరకు  మరో అవకాశం దొరక్కపోవడంతో జంషెడ్పూర్ వెళ్లి టాటా కంపెనీలో చేరారు. అదే సమయంలో మేనమామ కూతురు లీలావతిని ఎస్వీఆర్‌ పెళ్లి చేసుకున్నారు. నటనపై ఆయనకి ఉన్న పిచ్చి, అవకాశాలు రాకపోవడం చూసి ఆ దంపతుల మధ్య తరచూ సమస్యలు తలెత్తేవట. కానీ తన భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో ఎస్వీఆర్ వేటినీ లెక్క చేసేవారు కాదు. ఆ నమ్మకమే చివరకు నిజమైంది. కొద్ది రోజుల తర్వాత బీఏ సుబ్బారావు ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేయడానికి రమ్మని పిలిచారు. కానీ అప్పుడే తన తండ్రి చనిపోవడంతో అంత్యక్రియలవీ పూర్తయ్యాక మద్రాస్ చేరుకున్నారు ఎస్వీఆర్. అప్పటికే ఆ చాన్స్ మరొకరికి వెళ్లిపోయింది. కానీ బీఏ సుబ్బారావు ఆయనకి సన్నిహితుడు కావడంతో మరో పాత్రలో నటించే అవకాశమిచ్చారు. తర్వాత ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మనదేశం’, పి. పుల్లయ్య డైరెక్ట్ చేసిన ‘తిరుగుబాటు’ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు దక్కాయి. అయినా నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎస్వీఆర్ ఎదురు చూశారు.  సరిగ్గా అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. మొదటి సినిమా ‘షావుకారు’లో ఓ కీలక పాత్రను రంగారావుకిచ్చారు. అది ఆయనకి మంచి పేరు తెచ్చింది. ఇక ఆ తర్వాత  ‘పాతాళభైరవి’లో మాంత్రికుడి పాత్రకి కూడా నాగిరెడ్డి, చక్రపాణి.. రంగారావునే తీసుకున్నారు. కొత్త యాక్టర్‌‌కి అంత మంచి పాత్ర ఇవ్వొద్దని ఎంతమంది చెప్పినా వాళ్లు లెక్క చేయలేదు. చివరికి వారి నమ్మకమే నిజమైంది. ఆ పాత్రకి ఎస్వీఆర్ ప్రాణం పోశారు. సినిమా సూపర్ హిట్టయ్యింది. ఎస్వీఆర్ కెరీర్ మలుపు తిరిగింది. 

నవరస నాయకుడు
సాధారణంగా హీరోలకి వచ్చినంత గుర్తింపు మిగతా పాత్రధారులకు రాదు. వచ్చినా మంచి నటుడనే పేరు వస్తుంది తప్ప స్టార్‌‌డమ్ రాదు. కానీ ఎస్వీఆర్‌‌ అలా కాదు. హీరోలతో సమానమైన స్థాయి ఆయనది. నవరసాలనూ అత్యద్భుతంగా ప్రదర్శించే ఆయన నటనకు అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఆయన చేసిన పాత్రల్ని అభిమానులు మర్చిపోలేకపోయేవారు. మళ్లీ మళ్లీ చూసేవారు. నర్తనశాల, మాయాబజార్, భట్టి విక్రమార్క, బాలనాగమ్మ, విక్రమార్క విజయం, బొబ్బిలి యుద్ధం, సతీ సావిత్రి, పాండవ వనవాసం, అనార్కలి, దేవాంతకుడు, బంగారుపాప, మిస్సమ్మ, తోడికోడళ్లు, అప్పుచేసి పప్పుకూడు, భక్త ప్రహ్లాద, కలసి ఉంటే కలదు సుఖం, తాతా మనవడు, డాక్టర్ బాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నటించిన సినిమాల జాబితా పెద్దగానే ఉంటుంది. ఈ సినిమాల్లో ఆ పాత్రల్ని పోషించిన తీరు అబ్బురపరుస్తుంది. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి, విలన్‌గా భయపెట్టి, సాత్వికమైన పాత్రలతో కన్నీళ్లు పెట్టించి, మొత్తంగా తన నటనకి అందరూ దాసోహమయ్యేలా చేశారు ఎస్వీఆర్. మూడొందలకు పైగా సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించి.. వెర్సటైల్‌ యాక్టర్గా  ఖ్యాతి గడించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. హిందీలో తనే డబ్బింగ్ చెప్పుకునేవారు. అంటే ఎస్వీఆర్.. అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్.  

అరుదైన ఘనతలు
1955లో ‘బంగారుపాప’ అనే సినిమాలో  ఎస్వీఆర్ నటించారు. ఇలియట్ రాసిన ‘సైలాస్ మార్నర్’ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. కానీ మంచి సినిమా అనే పేరు మాత్రం వచ్చింది.  ఇందులో ఎస్వీఆర్‌‌ నటన అద్భుతం. ఈ  సినిమాని చూసిన చార్లీ చాప్లిన్... ఎస్వీఆర్‌‌కి ఫ్యాన్ అయిపోయాడు. ఇలియట్ కనుక బతికివుంటే ఎస్వీఆర్ నటన చూసి చాలా సంతోషించేవాడంటూ చాప్లిన్ పొగిడేశాడు. అలాగే మద్రాసులోని జెమినీ స్టూడియోలో ‘సతీ సావిత్రి’ షూటింగ్ జరుగుతోంది. రంగారావు యముడి పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో నాటి చైనా ప్రధాని చౌ అక్కడికి వచ్చారు. ఎస్వీఆర్ గాంభీర్యం, నటనా పటిమ ఆయనకి తెగ నచ్చేశాయి. దాంతో ఆయన దగ్గరకు వెళ్లి, షేక్‌హ్యాండ్ ఇచ్చి మరీ.. అభినందించారు. ఇక ‘నర్తనశాల’ సినిమాలో చేసిన కీచకుడి పాత్రకి గానూ జకార్తాలో జరిగిన ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డుతో పాటు బంగారు పతకాన్ని కూడా అందుకున్నారు.  హీరోల్ని కాదని ఆయనకు ఇచ్చారంటే ఎంత గొప్ప నటుడో, ఎల్లలు దాటి ఆయన కీర్తి ఎంతగా ఇతర దేశాలకు పాకిందో అర్థం చేసుకోవచ్చు. అలా అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నతొలి భారతీయ నటుడిగా ఎస్వీఆర్ చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. కమర్షియల్ యాడ్‌లో నటించిన మొదటి నటుడు కూడా ఆయనే. అప్పట్లోనే బర్క్లీ సిగరెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఎస్వీఆర్ వ్యవహరించారు. 

నటుడే కాదు...డైరెక్టర్ కూడా...
నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్వీఆర్..మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తీశారు.  ఆయన మొట్టమొదట డైరెక్ట్ చేసిన ‘చదరంగం’ సినిమా రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా గెల్చుకుంది. ఆ తర్వాత తీసిన ‘బాంధవ్యాలు’ మూవీ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది. నటి లక్ష్మి ఈ సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది. అయితే ఈ రెండు సినిమాలూ అవార్డులు అందుకున్నాయే తప్ప కమర్షియల్‌గా  మాత్రం సక్సెస్ కాలేదు. ఇక ఎస్వీఆర్‌‌లో మంచి రచయిత కూడా ఉన్నాడు. వేట, ఆగస్టు 8, పసుపు కుంకుమ, ప్రాయశ్చిత్తం, సులోచన లాంటి కొన్ని కథలు రాశారు.  అవి కొన్ని పత్రికల్లో  పబ్లిష్ కూడా అయ్యాయి. ఆ తర్వాతి కాలంలో వీటిని ‘ఎస్.వి.రంగారావు కథలు’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. తీరిక సమయాల్లో పుస్తకాలు బాగా చదివేవారు ఎస్వీఆర్. ముఖ్యంగా వివేకానందుడికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ సేకరించి లైబ్రరీలో పెట్టుకున్నారు. పెంపుడు జంతువులంటే ఆయనకి మహా ఇష్టం. వాటిలో రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలుండేవి. అవంటే ఎస్వీఆర్‌‌కి ప్రాణమట. సేవా కార్యక్రమాలకి కూడా సమయం వెచ్చించేవారు. చాలా సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు కూడా విరాళాన్ని ప్రకటించారు. పాకిస్థాన్‌తో యుద్ధం వచ్చినప్పుడు సభలు నిర్వహించి, ప్రదర్శనల ద్వారా విరాళాలు సేకరించి రక్షణ నిధికి అందించారు. ఎస్వీఆర్ శివ భక్తులు. ఉదయం పూజ చేశాకే మిగతా పనులు ప్రారంభించేవారు. తనని ప్రతిక్షణం వెనకుండి నడిపేది శివుడేనని ఆయన నమ్మేవారు. ఆయన ఇచ్చిన జీవితం పదిమందికీ ఉపయోగపడాలని భావించేవారు. 

ఎంత నేర్చుకున్నా.. ఒదిగుండేవారు..
ఏ పాత్ర చేసినా అందులో ఎస్వీఆర్ ఒదిగిపోయేవారు. ఎలాంటి పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసేవారు.  నటుడిగా కీర్తి శిఖరాలను అధిరోహించినా.. దర్శకుడి దగ్గర బడిలో పాఠాలు నేర్చుకునే పిల్లాడిలానే ఉండేవారు. చెప్పింది శ్రద్ధగా వినేవారు. దానికి తన ప్రతిభను జత చేసి అద్భుతమైన నటనను ప్రదర్శించేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సైతం ఎస్వీఆర్ కాంబినేషన్‌లో సీన్ అనగానే మరింత శ్రద్ధ పెట్టి నటించేవారట. అలాంటి నటుడు కనుకనే నట సార్వభౌమ, విశ్వ నట చక్రవర్తి, నటసింహ, నటశేఖర అంటూ ఎన్నో బిరుదులు ఆయన్ను వరించాయి. అయితే అవార్డులు మాత్రం దక్కలేదు.  ప్రభుత్వం కనీసం పద్మ అవార్డును కూడా ఆయనకి ఇవ్వలేదంటూ చాలామంది విమర్శించారు.  ‘మన దేశంలో పుట్టడం ఎస్వీఆర్ దురదృష్టం, ఆయన ఇంకే దేశంలోనైనా పుట్టి ఉంటే ఆయన స్థాయికి తగ్గ గుర్తింపు లభించేది’ అని గుమ్మడి అన్నారు. ఎస్వీఆర్కు  పురస్కారాలైతే రాలేదు కానీ, భారతీయ సినిమాకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2013లో ప్రభుత్వం ఎస్వీఆర్‌‌ ఫొటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. ఆయనకి ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకుని నటుణ్ని చేయాలని ఆశ పడ్డారు కానీ వీలు కాలేదు. 

తుది వీడ్కోలు
1974లో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎస్వీఆర్‌‌కి గుండెనొప్పి వచ్చింది. వెంటనే ఉస్మానియా హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇక నటించడం మంచిది కాదని, రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన వినలేదు. ఆ పరిస్థితుల్లో కూడా చక్రవాకం, యశోదకృష్ణ చిత్రాలు చేశారు. ‘యశోదకృష్ణ’ పూర్తయ్యాక అమెరికా వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకుందాం అనుకున్నారు. కానీ అంతలోనే (జులై18న) మరోసారి హార్ట్‌ అటాక్ రావడంతో మద్రాసులో కన్నుమూశారు. నాటితో ఓ మహానటుడి జీవనయానం ముగిసిపోయింది. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన చేసిన సంతకం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. 

ఇప్పటికీ నటుడంటే ఎస్వీఆరే. నటనంటే ఎస్వీఆర్‌‌దే. పౌరాణికమైనా, జానపదమైనా, చారిత్రకమైనా, సాంఘికమైనా.. ప్రతినాయకునిగానూ, గుణచిత్ర నటునిగానూ ఉంటూ తనదైన బాణీ పలికించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  ఆయనకి ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకుని నటుణ్ని చేయాలని ఆశ పడ్డారు కానీ వీలు కాలేదు. దాంతో ఎస్వీఆర్‌‌ లెగసీని ఎవరూ కొనసాగించలేదు. కానీ ఆయన్ని గురువుగా భావించి ఇప్పటికీ ఎంతోమంది నటనను నేర్చుకుంటూనే ఉన్నారు. ఆయనలా నటించాలని ఆరాటపడతారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే సూర్య చంద్రులు ఒక్కరే ఉన్నట్టు.. ఎస్వీఆర్‌‌ కూడా ఒక్కరే. ఆయనకి రీప్లేస్‌మెంట్ లేదు, ఉండదు.