
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని..అందుకే క్లౌడ్ బరస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ కుటుంబపాలన అవినీతిమయంగా మారిందని, నియంతృత్వాన్ని తలపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి ఇంకెక్కడా జరగలేదన్నారు. బీచ్కుంద మండల కేంద్రంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
అధికార పార్టీ వేధింపులతో జనం ఇబ్బంది పడుతున్నారని వివేక్ ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో బీజేపీ గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని, జనం గోస - బీజేపీ భరోసా పేరిట గ్రామాల్లో బైక్ ర్యాలీలతో ప్రజలకు మరింత చేరువవుతామని అన్నారు. గ్రామాలలో బీజేపీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల జరిగిన మోడీ సభ చారిత్రాత్మకమని వివేక్ అభివర్ణించారు. మోడీ ఆలోచనతోనే కోవిడ్ ను జయించామని, 200 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ఇప్పటి వరకు ఏ దేశం ఇవ్వలేదని అన్నారు. కోవిడ్ సమయంలో పేదలను ఆదుకున్న ఘనత మోడీదేనని వివేక్ వెంకటస్వామి ప్రశంసించారు.