కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ఫైర్

కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ఫైర్
  • బస్ చార్జీలు, పెట్రో ధరలతో జనం తిప్పలు పడుతున్నరు 
  • రాష్ట్రంలో పెంచినంతగా మరెక్కడా చార్జీలు పెంచలేదు  
  • జగిత్యాల జిల్లాలో బీజేపీ ర్యాలీ

జగిత్యాల/గొల్లపల్లి, వెలుగు: కరెంట్, బస్ చార్జీలను సీఎం కేసీఆర్ అడ్డగోలుగా పెంచారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు తగ్గించినా మన రాష్ట్రంలో మాత్రం తగ్గించడం లేదని ఫైర్ అయ్యారు. కరెంట్, బస్ చార్జీలు, పెట్రో ధరల భారంతో జనం తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ పై రూ.10 తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ యాత్రలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని 13 గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతును రాజును చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది. కమీషన్ల కోసం కాళేశ్వరం, మిషన్ భగీరథ అంచనాలను వేల కోట్లకు పెంచి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కేసీఆర్.. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం. చార్జీలు పెంచుతూ, దందాలు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటుండు. రాష్ట్రంలో పెంచినంతగా కరెంట్, బస్ చార్జీలు మరే రాష్ట్రంలోనూ పెంచలేదు” అని ఆయన మండిపడ్డారు. ‘‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదు. ఇండ్ల కోసమని రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను వేరే పథకాలకు మళ్లించారు. నిరుద్యోగ భృతి చెల్లించలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, స్టేట్ చీఫ్ సంజయ్ సారథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. 

గోడు వెళ్లబోసుకున్న జనం.. 

యాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన వివేక్​ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంట్ బిల్లులు ఇష్టమున్నట్లు పెంచారని, ఏసీడీ చార్జీలంటూ తమపై భారం మోపారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లలో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని, దీంతో తాము ఉపాధి కోల్పోయామని గీత కార్మికులు వాపోయారు. డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు రావడం లేదని కొందరు, పింఛన్లు రావడం లేదని మరికొందరు ఆవేదన చెందారు.  గొల్లపల్లి మండలంలోని 13 గ్రామాల్లో దాదాపు 500 బైకులతో ర్యాలీ సాగింది. మండలంలోని శ్రీరాములపల్లిలో పార్టీ జెండాను ఎగరేసి ర్యాలీని వివేక్ ప్రారంభించారు. ఆయన బైక్ నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ శ్రేణులు, జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శంకర్రావుపేట, మల్లన్నపేట, వెంగళాపూర్, నందిపల్లి, రాపల్లి, ఇస్రాజ్ పల్లి, వెనుగుమట్ల, బొంకూర్, అబ్బాపూర్, చిల్వాకోడూర్, గోవిందుపల్లె మీదుగా గొల్లపల్లి మండల కేంద్రం వరకు యాత్ర సాగింది. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగరవేశారు. ఇస్రాజ్ పల్లిలో వివేక్ వెంకటస్వామి ట్రస్ట్ పేరుతో పార్టీ కార్యకర్త భైరం సురేశ్ తయారు చేయించిన టీషర్టులను వివేక్ పంపిణీ చేశారు. 

రోడ్ల కోసం రాష్ట్రానికి లక్ష కోట్ల నిధులు.. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదర్శవంతమైన పాలన జరుగుతోందని, ఎక్కడా అవినీతికి తావులేకుండా ప్రధాని మోడీ పాలిస్తున్నారని వివేక్ చెప్పారు. 60 వేల కిలోమీటర్ల రోడ్లు వేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 8 ఏండ్లలో కేంద్రం నుంచి రోడ్ల కోసం రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు వచ్చాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గొల్లపల్లికి మినీ స్టేడియం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మండలంలో యాత్రను సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని తెలిపారు. ర్యాలీలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, అసెంబ్లీ పాలక్ సురభి నవీన్ కుమార్, అసెంబ్లీ ఇన్ చార్జ్ సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సత్యం, మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచే రాజేశ్ పాల్గొన్నారు.