కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయించండి: మాజీ ఎంపీ వివేక్

కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయించండి: మాజీ ఎంపీ వివేక్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి‌పై విచారణ జరిపించాలని ప్రధాని మోదీని బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కోరారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన మిషన్ భగీరథలో జరిగిన నిధుల గోల్ మాల్ పైనా విచారణ జరపాలని అభ్యర్థించారు. కాళేశ్వరం పేరిట సీఎం కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని దానిపై ఎంక్వైరీ చేయించాలన్నారు. తెలంగాణలో పీఎం ఆవాస్ యోజన స్కీమ్‌ అమలు చేయడం లేదని మోదీ దృష్టికి తెచ్చారు. రాష్ట్ర సర్కార్‌తో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా లబ్దిదారులను గుర్తించి ఆవాస్ స్కీమ్‌ను అమలు చేయాలని కోరారు. ఆర్థిక అభివృద్ధితోనే దళిత, బహుజనులపై వివక్ష తగ్గుతుందని, అందుకే ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న స్కీములకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను రూ‌.5200 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పెంచాలని వివేక్ వెంకటస్వామి మోడీకి విజ్ఞప్తి చేశారు. ముద్ర లోన్లను కూడా పెంచాలని కోరారు‌. 

ఆయుష్మాన్ భారత్‌ కింద ప్రస్తుతం రూ‌.5 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తున్నారని, దాన్ని రూ.10 లక్షలకు పెంచాలని‌ వివేక్ కోరారు. పెట్రోల్‌పై కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో దేశమంతా ఇంధన ధరలు తగ్గాయని, తెలంగాణ సర్కార్ ధరలు తగ్గించలేదన్న విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధిక‌ంగా ఉన్నాయని వాపోయారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు 15 శాతం పెరిగితే, భారత్లో అది 5.2 శాతంగానే ఉండడం మోదీ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని వివేక్ ప్రశంసించారు. జీడీపీ గ్రోత్ రేటు కూడా 6.9% ఉందని గుర్తు చేశారు. దేశంలో డేటా సబ్‌స్క్రిప్షన్ ప్రైజ్‌ను ₹268 నుంచి ₹9కి తగ్గించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశంలో‌ 2014 నాటికి 90 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహాదారులు ఉంటే, ఇప్పుడు 1.4 లక్షలకు పెరిగిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. ఇవన్నీ కేంద్ర సర్కార్ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు.