ఆర్ఎఫ్ సీఎల్ అందుబాటులోకి వస్తే తక్కువ ధరలకే ఎరువులు :  వివేక్ వెంకటస్వామి

ఆర్ఎఫ్ సీఎల్ అందుబాటులోకి వస్తే తక్కువ ధరలకే ఎరువులు :  వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా : రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్ సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కంపెనీని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటామని ప్రకటించడం ఏంటని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు లభ్యమవుతాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, లిక్కర్ స్కాం కేసులు బయటపడుతాయనే ఉద్దేశంతో ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో కేంద్రం 49 శాతం, తెలంగాణ 51శాతం వాటా ఉందని చెప్పి, బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనెల 12న రాష్ట్రానికి మోడీ
ఈనెల 12వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆర్ఎఫ్ సీఎల్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాదు.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. అనంతరం ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైనును అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోడీ రామగుండం వేదికగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. 

రాద్దాంతం సరికాదు 
మరోవైపు.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ పార్టీ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ విడుదల చేశారు. కార్యక్రమ ఆహ్వాన లేఖను సీఎం ముఖ్య కార్యదర్శికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో స్వయంగా వెళ్లి ఇచ్చారని తెలిపారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.