
కామారెడ్డి/ పిట్లం, వెలుగు: మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడితే, సీఎం కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఇన్ని అప్పులు చేసినప్పటికీ, ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగలేదన్నారు. కేసీఆర్‌ది పూర్తిగా అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన అని విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. అక్కడే ఈ నెల 21 నుంచి జుక్కల్ లో నిర్వహించనున్న ‘‘జనం గోస.. బీజేపీ భరోసా’’ కార్యక్రమంపై నియోజకవర్గ ముఖ్య లీడర్ల మీటింగ్ జరిగింది. ఈ రెండు సమావేశాల్లో వివేక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు. రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టారు. దీనికి ఇంకో రూ.30 వేల కోట్లు కావాలంటున్నారు. కానీ ఈ రెండింటితో ప్రజలకేం మేలు జరగలేదు. భగీరథ నీళ్లు సక్కగా వస్తలేవు. ఇప్పటి వరకు కాళేశ్వరంతో ఎకరా పారలేదు. ఈ ప్రాజెక్టులో రూ.కోట్ల అవినీతి జరిగింది”
అని వివేక్ అన్నారు.
ప్రజలు బీజేపీని కోరుకుంటున్నరు...
కేసీఆర్గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని వివేక్ అన్నారు. ‘‘కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు. ఆయన పాలనపై విసుగు చెందారు. కేసీఆర్ ను గద్దె దింపాలనే ఆలోచనతో ఉన్నారు” అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ‘‘కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్న డెవలప్మెంట్చూసి, అలాంటి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి” అని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. ఆయన తన ఆస్తులు పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల భారీ వర్షాలు వస్తే క్లౌడ్ బరస్ట్ అంటూ కామెంట్లు చేశారని మండిపడ్డారు.
కేంద్ర పథకాలపై ప్రజలకు చెప్పాలె...
కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని వివేక్ అన్నారు. ఉచిత బియ్యం అందించడంతో పాటు ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఫండ్స్ఇస్తే, సరిగా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని 4 సీట్లలోనూ బీజేపీ జెండా ఎగరాలన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జరిగే ‘‘పల్లె గోస.. బీజేపీ భరోసా’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర పథకాలపై ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.