సీఎం కేసీఆర్​పై వివేక్​ వెంకటస్వామి మండిపాటు

సీఎం కేసీఆర్​పై వివేక్​ వెంకటస్వామి మండిపాటు
  • కుర్చీ వేసుకుని పరిష్కరిస్తనంటివి.. ఇప్పుడు కేసులతో వేధిస్తుంటివి
  • హక్కుల కోసం పోరాడితే జైలుకు పంపుతున్నరని మండిపాటు
  • మంచిర్యాల జిల్లా కోయపోచగూడలో ఆదివాసీలకు పరామర్శ

మంచిర్యాల, వెలుగు: పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీల పట్ల కేసీఆర్​ సర్కారు దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. టీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కుర్చీ వేసుకుని పోడు సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు అమాయక గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయిపోయిందని, పోడు భూములకు పట్టాలు ఎప్పుడిస్తారని కేసీఆర్​ను నిలదీశారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో ఆదీవాసీలను పరామర్శించారు. ఐదు రోజులుగా ఆదీవాసీలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. వారికి ధైర్యం చెప్పారు. అరెస్టయి జైలుకు వెళ్లిన ఆదీవాసీ మహిళల కుటుంబాలను పరామర్శించారు. 

ఏడు తరాలుగా పోడు భూముల సాగు
కోయపోచగూడకు చెందిన ఆదివాసీలు ఏడు తరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్నట్టు చెప్తున్నారని వివేక్​ వెంకటస్వామి అన్నారు. 2004, 2007, 2008లో అటవీ శాఖ అధికారులు పలువురిపై కేసు పెట్టినా వాటిని కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఈ మధ్య పోడు చేసేందుకు ప్రయత్నించిన ఆదివాసీ మహిళలపై అధికారులు మళ్లీ కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లుల కోసం పిల్లలు ఏడుస్తున్నారని, ఓ పసిబిడ్డకు డబ్బా పాలు పట్టడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో ఒక మంత్రి హోటల్​కు అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేస్తే ఎవరూ నోరు మెదపలేదని, బాలికపై గ్యాంగ్​రేప్​ జరిగినా పట్టించుకోలేదని ఫైర్​ అయ్యారు. హైదరాబాద్​లో ప్రభుత్వ భూములు, అసైన్డ్​ భూములను అమ్ముతూ కాంట్రాక్టర్ల జేబులను కేసీఆర్​ నింపుతున్నారని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలను మాత్రం జైళ్లలో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. మాయమాటలతో ప్రజలను కేసీఆర్​ మభ్యపెడుతున్నారని అన్నారు. ఎంతో నమ్మకం పెట్టుకుని కేసీఆర్​ను ప్రజలు గెలిపిస్తే.. అన్ని విషయాల్లోనూ కేసీఆర్​ మోసం చేశారని మండిపడ్డారు. రాబోయే రాజుల్లో కేసీఆర్​ పతనం తప్పదన్నారు. అర్హులైన ఆదివాసీలకు పోడు పట్టాలివ్వాలని డిమాండ్ ​చేశారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​ రావు తదితరులున్నారు.