రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు : వివేక్ వెంకటస్వామి

రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు : వివేక్ వెంకటస్వామి

ఎలక్షన్స్ ముందు లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయడం లేదని రాష్ర్ట ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో సంబరాలు కాదు.. రైతుల కష్టాలు చూడాలని డిమాండ్ చేశారు. ‘‘రైతుబీమా ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇన్ పుట్ సబ్సిడీతో పాటు మిగతా సబ్సిడీలు తీసివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల కన్నా ఎక్కువ నష్టం జరుగుతోంది’’ అని చెప్పారు. 

భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని రాష్ర్ట ప్రభుత్వాన్ని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. రాష్ర్టంలోని ప్రతి వడ్ల గింజ కొంటానని చెప్పినట్లుగానే కొనాలని డిమాండ్ చేశారు. వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని కోరారు. ఇప్పటికీ రాష్ర్టంలోని పలుచోట్ల వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళలనపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాష్ర్టంలో ఎందుకు ఫసల్ బీమా అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటానని చెప్పి.. వారిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

దేశంలోని ఏ రాష్ర్టంలోని లేని అవినీతి ముఖ్యమంత్రి కేసీఆరే అని వివేక్ వెంకటస్వామి అన్నారు. చాలా చోట్ల మిషన్ భగీరథ సక్సెస్ కాలేదన్నారు. న్యూస్ పేపర్లలో వేలాది కోట్లు వెచ్చించి అడ్వర్ టైజ్ మెంట్లు ఇస్తూ గొప్పులు చెప్పుకుంటున్నారని అన్నారు. మిషన్ భగీరథపై అన్నీ తప్పుడు కథనాలే అని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అంతా అవినీతే చోటుచేసుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల యూస్ లో మంత్రి కేటీఆర్ అవార్డు తీసుకున్నారని, దీనిపై అవార్డు ఇచ్చిన సంస్థకు తాను లెటర్ రాస్తానని చెప్పారు. కాళేశ్వరంపై ప్రాజెక్టుపై ఏ ప్రతిపాదికన అవార్డు ఇచ్చారో లెటర్ రాస్తానని తెలిపారు. 

అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్‌ నగరంలో నిర్వహించిన ‘వరల్డ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌-2023’లో.. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌ (ఇంజినీరింగ్‌ ప్రగతికి సుస్థిర ప్రతీక)’గా గుర్తించి... అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ (ఏఎస్‌సీఈ) అవార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకున్నారు.