అవినీతిపరులు జైల్లో ఉండాలంటే.. కాంగ్రెస్ రావాలి : వివేక్ వెంకటస్వామి

అవినీతిపరులు జైల్లో ఉండాలంటే..  కాంగ్రెస్ రావాలి : వివేక్ వెంకటస్వామి
  • అవినీతిపరులు జైల్లో ఉండాలంటే..  కాంగ్రెస్ రావాలి
  • మేం అధికారంలోకి రాగానే కేసీఆర్ జైలుకు పోవుడు ఖాయం: వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరు ప్రజల కంటే ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం
  • ప్రజలకు సేవ చేసేందుకే చెన్నూరులో పోటీ చేస్తున్నట్టు వెల్లడి
  • చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో వివేక్ పర్యటన
  • మందమర్రిలో మాట్లాడుతుండగా కరెంట్ కట్ చేసిన బాల్క సుమన్ అనుచరులు 

కోల్​బెల్ట్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్, కాంట్రాక్టుల పేరుతో అవినీతికి పాల్పడినోళ్లు జైల్లో ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్​ నేత వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. ‘‘కేసీఆర్.. ధరణి, కాళేశ్వరం, మిషన్​భగీరథ ఇలా ప్రతిదానిలోనూ రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, తన ఇంట్లోళ్లకే ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వాళ్లకు నెలకు రూ.50 లక్షల జీతం వస్తోంది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకోగా.. ఆయన కుటుంబ సభ్యులకు ఇండ్లు, ఫాంహౌస్​లు వచ్చాయి. 

పేదలకు మాత్రం డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు రాలేదు” అని అన్నారు. ఆదివారం చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో వివేక్ పర్యటించారు. మందమర్రి మున్సిపాలిటీలోని ఫిల్టర్​బెడ్, విద్యానగర్, మారుతీనగర్​తో పాటు భీమారం, జైపూర్​మండల కేంద్రాల్లో ప్రచారం చేశారు. చెన్నూరు ఎంఆర్ఆర్ గార్డెన్స్​లో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి పాల్గొన్నారు. బెల్లంపల్లి పద్మశాలి భవన్​లో నిర్వహించిన కాంగ్రెస్ ​నియోజకవర్గ స్థాయి సభలో పాల్గొన్నారు. తనతో పాటు తన అన్న, బెల్లంపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వినోద్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

కాళేశ్వరంలో లక్షన్నర కోట్ల దోపిడీ.. 

అధికారంలో లేకపోయినా పదేండ్లుగా ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాలు పంచుకుంటున్నానని వివేక్​ చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే చెన్నూరు నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నానని తెలిపారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల సొమ్మును ఏపీ నేతలు దోచుకుంటే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమీషన్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,200 టీఎంసీల నీటిని పంట పొలాలకు విడుదల చేయాల్సి ఉండగా, గడిచిన నాలుగేండ్లలో కేవలం 40 టీఎంసీలే ఇచ్చారు. రూ.70 వేల కోట్లతో కాళేశ్వరం నిర్మించి, రూ.లక్షన్నర కోట్లు దోచుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులపై ప్రజలు తిరగబడాలి” అని పిలుపునిచ్చారు. కేసీఆర్​కు గుణపాఠం చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.  

బాల్క సుమన్​కు వెయ్యి కోట్లు ఎట్లొచ్చినయ్?  

చెన్నూరు ప్రజల సమస్యల కన్నా ఇసుక దందానే ఎమ్మెల్యే బాల్క సుమన్​కు ముఖ్యమని వివేక్ విమర్శించారు. ‘‘సుమన్ దృష్టి అంతా రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి? ఎంత వాటా వస్తుందనే దానిపైనే ఉంటుంది. 2014లో లోక్​సభ ఎన్నికల్లో నాపై పోటీ చేసినప్పుడు.. ‘రూ.100 కోట్లు వివేక్​వి, 100 కేసులు సుమన్​వి’ అంటూ ఆయన ప్రజలను మభ్యపెట్టాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రూ.వెయ్యి కోట్లు ఎలా సంపాదించాడు. ఓట్ల కోసం వస్తున్న బాల్క సుమన్​ను దీనిపై జనం నిలదీయాలి” అని పిలుపునిచ్చారు. బాల్క సుమన్ అహంకారంతో ఆఫీసర్లను, నాయకులను, ప్రజలను తిట్టడం, బెదిరింపులకు దిగడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

బాల్క సుమన్ మనుషులు కరెంట్ కట్ చేస్తున్నరు.. 

మందమర్రి మున్సిపాలిటీలో వివేక్, నల్లాల ఓదెలు ప్రచారం చేస్తుండగా బాల్క సుమన్ అనుచరులు కరెంట్ కట్ చేసి అడ్డంకులు సృష్టించారు. ఫిల్టర్​ బెడ్​ఏరియా, విద్యానగర్​లో వివేక్ మాట్లాడుతుండగా కరెంట్​ పోయింది. దీనిపై స్థానికులు, కాంగ్రెస్ ​శ్రేణులు మండిపడ్డారు. బాల్క సుమన్​అనుచరులే కరెంట్​కట్​ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. వివేక్​ స్పందిస్తూ.. ‘‘నేను ఎక్కడ మాట్లాడినా, అక్కడ బాల్క సుమన్ మనుషులు కరెంట్ కట్ చేస్తున్నారు. పవర్ కట్ చేసినంత మాత్రాన.. నా మాటలు మీ దాకా వినిపియ్యకుండా ఆపగలరా” అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. 

ALSO READ : లోకలా.. నాన్​ లోకలా..! .. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న హైకమాండ్

నా తమ్ముడు కాంగ్రెస్​లోకి రావడం సంతోషం: వినోద్ 

బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్​ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్​ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి సభలో వివేక్ ​వెంకటస్వామితో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘నా తమ్ముడు వివేక్​ కాంగ్రెస్​లోకి రావడం సంతోషంగా ఉంది. జైపూర్ పవర్ ప్రాజెక్టు మా నాన్న కాకా వెంకటస్వామి హయాంలోనే మంజూరైంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ కరెంట్​ అందించిన ఘనత తమదేనని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్​ ఈసారి ఓడిపోవడం ఖాయం. బెల్లంపల్లిలోని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. చెన్నూరులోని పేదల బాధ్యతను తమ్ముడు తీసుకుంటాడు’ అని వినోద్​ చెప్పారు.