కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆరే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆరే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం  అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ కేసీఆరేనని చెప్పారు. ఇరిగేషన్ శాకలో చీఫ్ ఇంజనీర్ (డిజైన్స్) ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన పాత్ర ఏమీ లేదన్నారు. కాళేశ్వరంపై అసలు తమను సంప్రదించలేదని కమిషన్ విచారణలో సీఈ చెప్పారని పేర్కొన్నారు.

80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌తో ఎక్కువ నష్టపోయింది మా చెన్నూరు నియోజకవర్గమే. గత 3, 4 రోజుల  నుంచి 40 వేల ఎకరాలకు నష్టం జరిగింది. గతేడాది ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఇరిగేషన్ మంత్రికి విన్నవించాం. ఫ్లడ్ బ్యాంకులు కడతారా? లేదంటే ఇంకేదైనా చేస్తారా? లేకపోతే చెన్నూరు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది” అని అన్నారు. కాళేశ్వరం డిజైన్‌పై వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా, ఆనాటి పాలకులు సొంత డిజైన్లతో నిర్మించారన్నారు. ఆనాడు నిర్ణయాలు తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.