బీఆర్ఎస్ ​పాలనలో ప్రజల బతుకులేం మారలె : వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ​పాలనలో ప్రజల బతుకులేం మారలె  : వివేక్ వెంకటస్వామి
  • బీఆర్ఎస్​పాలనలో ప్రజల బతుకులేం మారలె 
  • చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరం’తో లక్ష కోట్ల అప్పు ప్రజలపై మోపిన కేసీఆర్
  • బాల్క సుమన్​కు ఓటమి భయం పట్టుకుంది

కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రం వస్తే ప్రజలు, సింగరేణి సంస్థ బాగుపడుతుందని భావించినం.. కానీ బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనతో బతుకులు మారలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ కేసీఆర్​ఫ్యామిలీ మాత్రం బంగారు కుటుంబమయ్యిందని ఆరోపించారు. బుధవారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, మందమర్రి ఏరియా కేకే-5 సింగరేణి బొగ్గు గనిపై ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ సంయుక్త గేట్​మీటింగ్​లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలకు ఏమైతే అవసరమో వాటిని పూర్తి చేయకుండా కేసీఆర్ కేవలం కుటుంబ లాభం కోసం పనిచేశారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కానీ తన కుటుంబ సభ్యులకు వందల ఎకరాల ఫామ్ హౌస్ లను కట్టుకున్నాడని ఆరోపించారు. ‘‘కేసీఆర్ తెలంగాణ గుంజుకున్నా అంటున్నాడు. ఏం అధికారం ఉంది అని గుంజుకున్నరు. 

పార్లమెంటులో చట్ట ప్రకారం తెలంగాణ ఇచ్చి సోనియాగాంధీ మాట నిలబెట్టుకున్నరు. ఆరు గ్యారంటీలను కూడా తెలంగాణ ఇచ్చినట్టే సోనియాగాంధీ పూర్తి చేస్తారు” అని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.6లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లకు పైన అప్పును ప్రజల నెత్తిన రుద్దిండని విమర్శించారు. మిషన్ భగీరథ పెద్ద స్కామని కమీషన్ కోసం తెచ్చిన స్కీము అన్నారు. మేఘా కంపెనీతో పాత వాటర్ ట్యాంక్ లకు, పాత పైపులకు పెయింటింగ్ వేయించి రూ.40వేల కోట్లను దండుకున్నారని మండిపడ్డారు.

 సీఎం కేసీఆర్ తెలంగాణను దోచుకుంటే.. దత్తపుత్రుడు బాల్క సుమన్ చెన్నూరులో ఇసుక దందాతో సంపాదిస్తున్నడని అన్నారు. వాళ్లిద్దర్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాల్క సుమన్​కు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే మాజీ ఎమ్మెల్యే ఓదెలు కాంగ్రెస్​కు రాజీనామా చేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నడని మండిపడ్డారు. ‘‘సుమన్​కు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతున్నడు.. రామకృష్ణాపూర్​లో మార్నింగ్ వాక్​లో చాలా మంది వాకర్స్ నాకు సమస్యలు చెప్పారు. బాల్క సుమన్​వాళ్లను దబాయిస్తున్నడు” అని అన్నారు. మందమర్రి ప్రచారంలో తిరగాలని బాల్క సుమన్ ఒక్కొక్కరికి మూడు వందలు చొప్పున ఇస్తున్నాడన్నారు. సూట్కేస్ లో షర్ట్, పాంట్ మాత్రమే ఉన్నది అన్న వ్యక్తికి వెయ్యి కోట్ల డబ్బు ఎట్లోచ్చిందని ప్రశ్నించారు.

సింగరేణి సంస్థ ఫండ్స్​ మళ్లింపు

సింగరేణి సంస్థను కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నడు. ప్రభుత్వ స్కీంల పేరుతో సంస్థ ఫండ్స్​ను మళ్లించాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సింగరేణి ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్​టీ, సీఎస్సాఆర్​ నిధులను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించినా ఇక్కడి ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టించుకోలేదన్నారు. ఆయనకు సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమం కన్నా కమీషన్లే ముఖ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సొంతింటి కలను నెరవేర్చుతామని, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల వడ్డీలేని రుణం అందిస్తామన్నారు. 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంటు చేస్తామని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను సింగరేణి రిటైర్డు కార్మికులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఆసుపత్రి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం సరిగ్గాలేదన్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు కొత్తగూడెం నుంచి కాకుండా ఇక్కడి నుంచి డైరెక్ట్​గా రెఫరల్ చేయిస్తామన్నారు.

జనాన్ని లిక్కర్​కు బానిసలుగా చేసిన్రు : గడ్డం వంశీకృష్ణ

ప్రభుత్వ ఖజానాను నింపే పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు పర్మిషన్‌‌ ఇచ్చి, ప్రజలను లిక్కర్‌‌‌‌కు బానిసలుగా చేసి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం కేసీఆర్‌‌‌‌పై కాంగ్రెస్ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇసుక దందాతో రూ.వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు వినే టైమ్ కూడా ఆయన ఇవ్వరని ఫైర్‌‌‌‌ అయ్యారు.

 కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. సింగరేణి సంస్థ నష్టాల పరిశ్రమల జాబితాలో చేరినప్పుడు కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణాన్ని ఇప్పించి ఆ సంస్థను కాపాడినట్లు వంశీకృష్ణ గుర్తుచేశారు. కాకా చొరవతో లక్ష మందికి ఉద్యోగ భద్రత కల్పించారన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫయాజ్, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.