రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతున్నది: వివేక్​ వెంకటస్వామి 

రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతున్నది: వివేక్​ వెంకటస్వామి 
  •     ఉద్యమకారులను విస్మరించిన టీఆర్​ఎస్​ సర్కార్​
  •     కమీషన్ల కోసమే ఇరిగేషన్​ ప్రాజెక్టులని ఫైర్​
  •     ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవానికి హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, గిరిజన బంధు, గొర్రెల పంపణీ.. ఇలా అనేక స్కీమ్​లు అటకెక్కాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కమీషన్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్​లను నిర్మిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమా?” అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ సర్కార్ విస్మరించిందని అన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్​లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంలో వివేక్​ వెంకటస్వామి, పుదుచ్చేరి మంత్రి ఏకే సాయి జే శరవణన్​ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్​ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చరిత్రను చాటేలా సెంటర్ హాల్​లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను సందర్శించారు. అనంతరం వివేక్​ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ ఒక గొప్ప మేధావి అని,  అన్నీ వర్గాలకు న్యాయం జరిగేలా ముందుచూపుతో భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారని అన్నారు. ఉమెన్ ఎంపవర్ మెంట్, మహిళల హక్కులు, కార్మికులకు మినిమం వేజేస్ కోసం ఆనాడే అంబేద్కర్ పోరాడారని ఆయన పేర్కొన్నారు.

ప్రొవిజన్స్​ను కేసీఆర్​ సర్కార్​ దుర్వినియోగం చేస్తున్నది

చిన్న రాష్ట్రాలు ఉంటే బాగుంటుందని, చిన్న రాష్ట్రాలతోనే అద్భుత పాలన అందించవచ్చని రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచారని వివేక్​ వెంకటస్వామి చెప్పారు. ఆ ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని గుర్తుచేశారు. అయితే, మంచి ఉద్దేశంతో అంబేద్కర్ పొందుపరిచిన పలు ప్రొవిజన్స్​ను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.  ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో అవినీతి పాలనకు కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని అన్నారు. అన్నివర్గాల ప్రజల కోసం రాజ్యాంగం రాస్తున్నట్లు అంబేద్కర్ చెప్పారని, రాజ్యాంగం అమలు రాజకీయ నాయకుల చేతిలోనే ఉంటుందని ఆనాడే హెచ్చరించారని గుర్తు చేశారు. సరైన నాయకుడు లేకపోతే రాజ్యాంగ వినియోగంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే ‘రాజ్యాంగ దినోత్సవం’ను ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మించిందని, లండన్​లో అంబేద్కర్ మెమోరియల్​ కోసం ప్రయత్నిస్తున్నదని అన్నారు.  ఇటీవల జరిగిన కేంద్ర కేబినేట్ విస్తరణలోనూ 12 మంది ఎస్సీలకు అవకాశం కల్పించారని ఆయన తెలిపారు.