
ఈ నెల 7 నుంచి మునుగోడులో బైక్ యాత్ర నిర్వహిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు బైపోల్ ఎందుకు వచ్చిందో ప్రజలకు వివరిస్తామన్నారు. స్టీరింగ్ కమిటీతో పాటు సీనియర్లు కూడా ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ప్రచారంలో అందరినీ కలుపుకొని పోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారన్నారు. ఫేక్ ఓటర్ల అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. బీజేపీలో చేరిన లీడర్లను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. 10న బండి సంజయ్, తరుణ్ చుగ్ తో మునుగోడులో మీటింగ్ ఉంటుందన్నారు.
గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం
మునుగోడు బైపోల్ లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. ఇవాళ బీజేపీ ఆఫీసులో జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ అయ్యారు. మునుగోడులో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశా నిర్దేశం చేశారు . ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనా రెడ్డి, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. కరీంనగర్ నుంచి జూమ్ ద్వారా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మురళీధర్ రావు పాల్గొన్నారు.