నాయకుడిగా అన్ని వర్గాల కోసం పని చేస్తున్నా..దళితుడిగానే చూస్తరా?

నాయకుడిగా అన్ని వర్గాల కోసం పని చేస్తున్నా..దళితుడిగానే చూస్తరా?

హైదరాబాద్, వెలుగు: ‘‘దళిత వర్గాల సంక్షేమం కోసమే కాకుండా అన్ని వర్గాల మేలు కోసం దళిత నాయకులు పాటుపడుతున్నరు. కానీ అలాంటి నాయకులను కేవలం దళిత నాయకులుగానే గుర్తించడం విచారకరం. ‘దళిత సామాజిక వర్గానికి మాత్రమే నేతలు’ అనే రీతిలో కొందరు వ్యవహరిస్తున్న తీరును చూస్తే బాధ కలుగుతున్నది. ఇది సరైన విధానం కాదు. వారి తీరు మారాలి’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తన లాంటి వాళ్లు దళిత సామాజిక వర్గం నుంచి నాయకులుగా ఎదిగినా.. తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ కొందరు అలాంటి వారిని నాయకులుగా గుర్తించడం లేదని, సమాజంలో దళిత నాయకులపైనా వివక్ష ఎలా కొనసాగుతున్నదో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు. ఇతర సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకులు ఈ విషయాన్ని గుర్తించాలని, తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దళితుల హక్కుల కోసం పోరాడిన సంత్ రవి దాస్ జయంతి సందర్భంగా బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

దళిత ద్రోహి కేసీఆర్

కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి సంత్ రవిదాస్ అని వివేక్ వెంకటస్వామి కొనియాడారు. దళితులు గుడిలోకి రావాలని పోరాటం చేసిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. సంత్ స్ఫూర్తితోనే ప్రధాని మోడీ పని చేస్తున్నారని చెప్పారు. దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీదేనన్నారు. 70 ఏండ్ల తర్వాత కేబినెట్‌‌‌‌లో దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మోడీ అని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. దళితులకు సీఎం పదవి ఇవ్వకపోగా.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, తర్వాత అమర్యాదకరంగా బర్తరఫ్ చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళిత అధికారులపైనా వివక్ష కొనసాగుతున్నదని ఆరోపించారు.

వాళ్లకు రాజ్యాంగంపై గౌరవం లేదు: ఈటల

దొడ్డిదారిన అధికారంలోకి రావాలనుకునే వారికి రాజ్యాంగంపై గౌరవం ఉండదని సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఓటుకు వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. గొప్ప మాటలు చెప్పే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు దళితులంటే వ్యతిరేకతేనని ఆరోపించారు. సంత్ రవిదాస్ లాంటి ఎంతో మంది త్యాగఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని అన్నారు. గుడిసెలో ఉన్నవారికి,  బంగ్లాలో ఉన్న వారికి సమానంగా ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై, దళిత అధికారులపై వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. కుర్చీ వేసుకొని దళిత బంధు అమలు చేస్తానని కేసీఆర్ చెప్పారని, మరి హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత దాని అమలు ఏమైందని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ లాంటి వారు వస్తరు.. పోతరు.. కాని మనమే చరిత్ర నిర్మాతలం. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది” అని అన్నారు.

దళితుడిని సీఎం చేస్తానని చేయలే: లక్ష్మణ్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దె దించేందుకు దళిత సమాజం ఏకం కావాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. 19 శాతం రిజర్వేషన్లను పెంచే స్వేచ్ఛ కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఉన్నప్పటికీ రాజ్యాంగం మార్చాలని అనడం ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్లను అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చా ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ మునుస్వామి, పార్టీ నేతలు మనోహర్ రెడ్డి, రజనీ, ఎస్.కుమార్ తదితరులు హాజరయ్యారు.