కాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..

కాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..

సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతోనే గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాజెక్టు అంటూ  టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. కానీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుది తప్పుడు డిజైన్ అని చెబుతున్నారని తెలిపారు. కాళేశ్వరంతో ఇప్పటి వరకు సాగునీరు ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ చెబుతుంటే..కేసీఆర్ మాత్రం వేల ఎకరాలకు సాగునీరిచ్చామని చెబుతున్నారన్నారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని వేల ఎకరాలకు సాగునీరిచ్చారో  తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

గోదావరి బ్యాక్ వాటర్తో నీట మునిగిన.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీ బాధితులను వివేక్ పరామర్శించారు. వరదలతో ఇండ్లు నీటమునిగి అన్నివిధాలా నష్టపోయామని వివేక్ వెంకటస్వామి ముందు బాధితులు గోడు వెళ్ళబోసుకున్నారు. నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వివేక్ డిమాండ్ చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావిత బాధితులంతా కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. పరిహారం ఇవ్వకుంటే ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.  కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివేక్ తెలిపారు.

అటు చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి..భారీ వర్షాలతో నీటమునిగిన పంటలను, దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. దేవులవాడ, అన్నారం, పుల్లగామ గ్రామాల్లోని బాధితులను పరామర్శించారు. విశాక ట్రస్టు ద్వారా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.