మెమొరబుల్ మూవీ

మెమొరబుల్ మూవీ

ఒకప్పుడు హీరోగా ఆకట్టుకున్న వీకే నరేష్.. సెకెండ్ ఇన్నింగ్స్‌‌లో క్యారెక్టర్‌‌‌‌ ఆర్టిస్టుగా దూసుకెళ్తున్నారు. నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ తీసిన ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించారాయన. రేపు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కాసేపు ఇలా కబుర్లు చెప్పారు.

‘‘చాలా సినిమాల్లో తండ్రి పాత్రలు పోషించినా.. ఇందులో చేసిన క్యారెక్టర్ నా కెరీర్‌‌‌‌లోనే బెస్ట్ ఫాదర్ రోల్. అందుకు దర్శకుడి రైటింగ్‌‌తో పాటు నానికి నాకు మధ్య ఉన్న కామెడీ టైమింగ్ కారణం. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే డిఫరెంట్ ఎమోషన్స్ చూపించే కీలకమైన పాత్ర. భలే భలే మగాడివోయ్, దేవదాసు చిత్రాల తర్వాత మళ్లీ నానితో కలిసి నటించడం హ్యాపీ.  మా ఇద్దరి మధ్య సీన్స్‌‌లో ఒక్కోసారి ఒక్కో ఎమోషన్ ఉంటుంది. ఆర్టిస్టులందరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుటయింది. ఫ్యామిలీ సినిమాలు తగ్గిన టైమ్‌‌లో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెమొరబుల్ ఫ్యామిలీ మూవీగా నిలుస్తుంది. వివేక్ ఆత్రేయ నెక్స్ట్ లెవెల్‌‌కి వెళ్తాడు. వరుస విజయాల్లో ఉన్న మైత్రి సంస్థకి మరో విజయం దక్కుతుంది. ప్రస్తుత సమాజంలో కులాలు, మతాలు, ఖండాలు దాటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మరోవైపు లివింగ్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. ఐదారేళ్లు కలిసుండి ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటున్నారు. వాటిదే భవిష్యత్తు అవుతోంది.  డైవర్సులు కూడా అంతే పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జెన్యూన్‌‌గా లవ్‌‌ చేసుకున్న ఇద్దరు ప్రేమికులు తమ కుటుంబాలను ఒప్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా. రెండు భిన్నమైన రెలీజియన్స్‌‌లో ఏ ఒక్కరినీ నొప్పించకుండా ప్రతి సీన్‌‌ను చక్కగా తీశాడు వివేక్. ఇక ప్రతి నటుడికి ఒక స్థాయి దాటాక తనకంటూ ఓ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ వచ్చేస్తుంది. దాంతో ప్రేక్షకులకు బోర్ కొట్టి ఫేడవుట్​ అవుతారు. అందుకే నేను దర్శకుడి స్క్రిప్ట్‌‌ను బట్టి నేను ప్రవర్తిస్తానే తప్ప నటించను. సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం. వాళ్లతో ఆర్టిస్టుకు కరెక్ట్‌‌ టైమింగ్ ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్‌‌కి వెళ్లడం ఖాయం.’’