ఏప్రిల్ 18 నుంచి వొడాఫోన్ ఐడియా ఎఫ్‌‌‌‌పీఓ

ఏప్రిల్ 18 నుంచి వొడాఫోన్ ఐడియా ఎఫ్‌‌‌‌పీఓ
  •     ఒక్కో షేరు ధర రూ.10–11
  •     ఇష్యూ సైజ్‌‌‌‌ రూ.18 వేల కోట్లు
  •     కనీస పెట్టుబడి రూ.14,278

న్యూఢిల్లీ:  వొడాఫోన్ ఐడియా రూ.18 వేల కోట్ల విలువైన ఫాలో ఆన్‌‌‌‌ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌‌‌‌పీఓ) ను ప్రకటించింది. ఒక్కో షేరును రూ. 10–11 దగ్గర అమ్మనుంది. ఇప్పటి  వరకు వచ్చిన ఎఫ్‌‌‌‌పీఓల్లో ఇదే పెద్దది కావడం విశేషం. వొడాఫోన్ ఐడియా (వీ)  ఎఫ్‌‌‌‌పీఓ ఈ నెల 18 ఓపెన్‌‌‌‌ అవుతుంది. 22 న ముగుస్తుంది.  ‘ఎఫ్‌‌‌‌పీఓ ద్వారా రూ.18 వేల కోట్లను సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన మీటింగ్‌‌‌‌లో ప్రైస్ బ్యాండ్‌‌‌‌ను ప్రకటించింది’ అని బీఎస్‌‌‌‌ఈ ఫైలింగ్‌‌‌‌లో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. 

ఎఫ్‌‌‌‌పీఓ ప్రకటనతో కంపెనీ షేర్లు శుక్రవారం ఒకటిన్నర శాతం పెరిగాయి.  రూ.13.15 దగ్గర సెటిలయ్యాయి. ఈ ధరతో పోలిస్తే ఎఫ్‌‌‌‌పీఓ ధర 27 శాతం తక్కువ.  తాజాగా ప్రమోటర్ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.2,075 కోట్లను వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసింది. ఒక్కో ప్రిఫరెన్షియల్‌‌‌‌ షేరును రూ.14.87 కు కొనుగోలు చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూలో కనీసం 1,298 షేర్ల  కోసం బిడ్స్ వేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ కోసం రూ.10–11 ప్రైస్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో అప్పర్ బ్యాండ్ దగ్గర ఇన్వెస్టర్లు కనీసం రూ.14,278 ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు యెస్ బ్యాంక్‌‌‌‌కు చెందిన రూ.15 వేల కోట్ల ఎఫ్‌‌‌‌పీఓ అతిపెద్దదిగా ఉంది. ఈ నెల 15 నుంచి వివిధ సిటీలలో  రోడ్‌‌‌‌ షోలు నిర్వహిస్తామని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.