
Vodafone Idea: ఇటీవల దేశంలోని టెలికాం రంగంలో వ్యాపారం చేస్తున్న వొడఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, టాటా టెలీసర్వీసెస్ కంపెనీలు తమ స్పెక్ట్రమ్ ఏజీఆర్ బకాయిలను మాఫీ చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టేసింది. పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఇలాంటి అభ్యర్థనతో తమ ముందుకు రావటం ఆశ్చర్యాన్ని కలిగించిందని ధర్మాసనం వెల్లడించింది.
టెలికాం కంపెనీలపై ప్రభుత్వం విధించిన పెనాల్టీలు, వడ్డీల వ్యవహారానికి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలో భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడఫోన్ ఐడియా ఏకంగా రూ.30వేల కోట్ల వరకు ఉన్న స్పెక్ట్రమ్ బకాయిల వడ్డీ, పెనాల్టీలను రద్దు చేయాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వొడఫోన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగీ టెలికాం వ్యాపారంలో కంపెనీలు కొనసాగటానికి, ఆరోగ్యకరమైన కాంపిటీషన్ కోసం ముఖ్యమని కోర్టుకు తెలిపారు.
ఈ వార్త బయటకు రావటంతో మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో వొడఫోన్ ఐడియా స్టాక్ ధర ఏకంగా 10 శాతం వరకు పతనాన్ని నమోదు చేసింది. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.6.72 వద్ద స్థిరపడింది. భారీ నష్టాలతో అత్యంత కష్టతరంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఈ ప్రైవేటు టెలికాం కంపెనీలో భారత ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టులో టెలికాం కంపెనీలు తమ పిటిషన్ లో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరినప్పటికీ ధర్మాసనం దానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది.
ALSO READ | అసలు క్రిప్టో కరెన్సీలు ఏంటి..? ఇవి అసలు ఇండియాలో లీగలేనా..? నిపుణుల మాటఇదే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20వేల మంది ఉద్యోగులను కలిగి ఉన్న వొడఫోన్ ఐడియాకు టెలికాం వ్యాపారంలో 18 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కంపెనీకి ఉన్న లక్ష 19వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటం దాదాపుగా అసాధ్యమని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో సహకారం లభించకపోతే ఒక్క ఆర్థిక సంవత్సరం కంటే కంపెనీని ముందుకు నడిపించటం సాధ్యం కాదని విఐ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే వెల్లడించింది. ఇదే జరిగితే కంపెనీ దివాలా తీయటం కాయంగా తెలుస్తోంది. మెుత్తానికి అంబానీకి చెందిన రిలయన్స్ జియో రాకతో భారత టెలికాం వ్యాపారం కళతప్పటమే కాకుండా ఆ రంగంలోని ఆటగాళ్లకు మనుగడ అసాధ్యంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.