వరద బాధితులకు.. దాతలే దిక్కు

వరద బాధితులకు.. దాతలే దిక్కు
  • ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు
  • నగదు, నిత్యావసర సరుకుల పంపిణీ
  • దాతలు ముందుకు రావాలంటూ ఆఫీసర్లు, ఎమ్మెల్యేల రిక్వెస్టులు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో వరద బాధితులకు సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి సాయం చేయకపోవడంతో దాతల వైపు అధికారులు, ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలంటూ వివిధ సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవల ములుగు జిల్లాలో వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియా వేదికగా విన్నవించారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, పలుచోట్ల సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. కొందరు నగదు రూపంలో సాయం చేస్తుంటే, ఇంకొందరు బియ్యం, పప్పు, చింతపండు, ఆయిల్ ప్యాకెట్లు, ఉప్పు లాంటి నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. 

సర్వేలతో కాలయాపన

ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 40 వేల కుటుంబాలపై ఎఫెక్ట్ పడింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇండ్లు కూలి కొందరు, వరదల్లో సామగ్రి కొట్టుకపోయి కొందరు కట్టుబట్టలతో మిగిలారు. పదివేల మందికి పైగా రిలీఫ్ క్యాంపులకు వెళ్లి తలదాచుకున్నారు. ఇండ్లలోని బియ్యం, పప్పు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్​ వస్తువులు నీట మునిగి పాడయ్యాయి. 30 మందికి పైగా వరదల్లో చిక్కుకుని ప్రాణాలను కోల్పోయారు. అదే సమయంలో 3 వేలకు పైగా ఇండ్లు కూలిపోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. 16 లక్షల ఎకరాల్లో పంటలు కొట్టుకపోయాయి. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతో వందల కోట్ల నష్టం జరిగింది. అయినా బాధితులను ఆదుకునేందుకు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. విపత్తులు జరిగినప్పుడు సత్వర సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్డీఆర్​ఎఫ్​ కింద మొదటి విడత రాష్ట్రానికి రూ.188 కోట్లు అందజేసింది. ఫండ్స్ ఉన్నప్పటికీ వరద బాధితులకు రాష్ట్ర సర్కారు ఎలాంటి సాయం చేయడం లేదు. కనీసం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయడం లేదు. చనిపోయిన వాళ్ల అంత్యక్రియలకు తక్షణ సాయం కింద పైసా ఇయ్యలేదు.

తోచిన సాయం చేస్తున్నరు

వరద బాధితుల దయనీయ స్థితిని చూసి పలువురు చలించిపోయి తోచిన సాయం అందజేస్తున్నారు. ఖమ్మంలో ఓ ఉన్నతాధికారి విజ్ఞప్తి మేరకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.4.40 లక్షల విలువ చేసే వంద క్వింటాళ్ల బియ్యాన్ని వరద బాధితులకు అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వెయ్యి మంది బాధితులకు 10 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేశారు. ఖమ్మంలోని మిత్ర గ్రూప్ ఆధ్వర్యంలో 300 మంది వరద బాధితులకు 25 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులను అందించారు. ఖమ్మం రూరల్​ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు 10 కేజీల చొప్పున బియ్యం, ఇతర నిత్యావసరాలను బాధితులకు పంచారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో మున్నేరు వరదతో నష్టపోయిన కాలనీల్లో 300 కుటుంబాలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలో 10 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. 

మంత్రి పువ్వాడ అజయ్‌‌కు చెందిన పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలాది మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తాలను వరద బాధితులకు అందించారు. పువ్వాడ ఫౌండేషన్, మమత ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచితంగా హెల్త్ క్యాంపులను ఏర్పాటుచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెందిన జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఇంటికి రూ.4 వేల చొప్పున నగదు​అందజేశారు. భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేతలు వరద బాధితులకు మంచి నీళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. 

ప్రభుత్వం సాయం చేయాలి

మున్నేరు వరద వల్ల నా ఇల్లు మునిగి, ప్రహరీ గోడ కూలిపోయింది. బేకరీ యంత్రం పూర్తిగా ఖరాబయ్యింది. ఉపాధి కోల్పోయాం. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి. 
- నిమ్మరబోయిన నాగరాజు,వరద బాధితుడు, ఖమ్మం