ఎండ్రకాయ ట్యాంకర్‌.. సైడ్‌లకు ఉరుక్తది!

ఎండ్రకాయ ట్యాంకర్‌.. సైడ్‌లకు ఉరుక్తది!

ఎండ్రకాయలు తెలుసు కదా.. అవి పక్కకు కూడా నడుస్తయి. ఇదిగో అట్లాంటిదే ఈ యుద్ధ ట్యాంకర్​ కూడా. ముందుకు వెళ్లడంతో పాటు పక్కకూ దూసుకెళుతుంది. దీని పేరు స్కారబీ. బీటిల్​ అనీ పిలుస్తున్నారు. వోల్వో కంపెనీకే చెందిన ఆర్కూస్​ అనే కంపెనీ ఈ మిలటరీ యుద్ధ ట్యాంకును తయారు చేసింది. అతి త్వరలోనే ఫ్రాన్స్​ ఆర్మీలో అది చేరబోతోంది. దీనికి రెండు ఇంజన్లుంటాయి. అవి కూడా ముందుండవు. వెనక వైపుంటాయి. ఒకటి ఎలక్ట్రిక్​ ఇంజన్​ కాగా, ఇంకోటి డీజిల్​ ఇంజన్​. 6.6 టన్నుల బరువున్నా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రివ్వున దూసుకెళ్లిపోగలదీ స్కారబీ.

నిజానికి యుద్ధ ట్యాంకులు నెమ్మదిగా వెళతాయి. కానీ, ఈ యుద్ధ ట్యాంకు కోసం స్పీడ్​పైనా దృష్టి పెట్టి పనిచేశామని ఆర్కూస్​ సీఈవో ఇమ్మాన్యుయెల్​ లవాచెర్​ చెప్పారు. ఆత్మరక్షణ కోసం పక్కకు పరిగెత్తడంతో పాటు, స్పీడ్​కూ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 6 అడుగుల ఎత్తుండే స్కారబీ, పొడవు, వెడల్పు 15 అడుగులుంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్​కున్న తేలికపాటి యుద్ధ ట్యాంకుల స్థానంలో వీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 2025 నాటికి ఈ ఎండ్రకాయ ట్యాంకు యుద్ధ రంగంలోకి దిగుతుంది. పీతల్లా పక్కకు నడవడం వల్ల మందుపాతరలను ఈజీగా తప్పించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.