
న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో తనపై దాఖలైన కేసు చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ తరఫు అడ్వకేట్ ముకుల్ రోహిత్గీ సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. ఈ కేసులో ముందుగా రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు. అలాగే, 2015లో అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి.. లంచం ఇవ్వడం కూడా నేరం కాదని తెలిపారు.
ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియామావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021, జులై 22న రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ 2021, ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య వేర్వేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లు బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.