80 ఏండ్లు పైబడినోళ్లకు ఇంటి నుంచే ఓటు : సీఈసీ రాజీవ్ కుమార్

80 ఏండ్లు పైబడినోళ్లకు  ఇంటి నుంచే ఓటు :  సీఈసీ రాజీవ్ కుమార్

రాయ్‌‌పూర్: చత్తీస్‌‌గఢ్‌‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్​లో 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఇంటి నుంచే ఓటు వేయవచ్చని చీఫ్ ఎలక్షన్  కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. ఇందుకోసం వారు 5 రోజుల ముందు ఫారమ్ 12 డీ నింపాలని తెలిపారు. రాష్ట్రంలో 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 2 లక్షలకు పైగా ఉన్నారని ఆయన తెలిపారు. 

అలాగే, ఈ ఓటర్లకు పోలింగ్ కేంద్రాలకు పిక్ అండ్​ డ్రాప్ సౌకర్యం కూడా ఉంటుందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎలక్షన్​కమిషన్​ టీం రెండు రోజులుగా చత్తీస్​గఢ్​లో ఆ రాష్ట్ర సీఎస్​, డీజీపీ, రాజకీయ పార్టీలు, లా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం, నగదు, మాదక ద్రవ్యాల తరలింపును నిరోధించేందుకు 105 చెక్‌‌ పోస్టులు,  సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అడ్మినిస్ట్రేటివ్, లా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అథారిటీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.