ఆ ఓటర్ ఐడీ వివరాలు ఇవ్వండి.. తేజస్వి యాదవ్ కు ఈసీ నోటీసులు

ఆ ఓటర్ ఐడీ వివరాలు ఇవ్వండి..  తేజస్వి యాదవ్ కు ఈసీ నోటీసులు
  • ఆర్జేడీ నేత మీడియా ముందు చూపిన ఎంపిక్ నెంబర్ పై దర్యాప్తు చేస్తామని వెల్లడి 
  • తేజస్వికి రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని, ఇది నేరమన్న బీజేపీ  

పాట్నా: ఓటర్ జాబితాలో తన పేరు లేదంటూ ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​ చేసిన ఆరోపణలపై ఎన్నిక సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే ఓటర్ జాబితాలో పేరున్నట్లు బయటపెట్టిన ఈసీ.. తాజాగా ఆదివారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సహకరించాలని అందులో పేర్కొంది. మీడియా ముందు తేజస్వి యాదవ్ చూపెట్టిన ఎపిక్​ నెంబర్ ఆర్​ఏబీ2916120పై ప్రాథమికంగా విచారణ జరపగా.. ఆ నంబర్​తో అధికారికంగా ఓటర్ ఐడీ జారీ కాలేదని వివరణ ఇచ్చింది. ఆయనకు ఆర్​ఏబీ0456228 నంబర్​తో అధికారిక ఓటర్ ఐడీ కార్డు ఉందని తెలిపింది. 

ఆ ఓటర్ ఐడీ ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో కూడా స్పష్టం చేసింది. మీడియా ముందు చూపెట్టిన ఎపిక్ నంబర్ పూర్తి వివరాలు, దాని ఒరిజినల్ కాపీతోపాటు తాము అధికారికంగా ఇచ్చిన ఎపిక్​ నంబర్​తో కూడా ఓటర్ ఐడీ పూర్తి వివరాలు అందజేయాలని.. దీనిపై దర్యాప్తు జరుపుతామని నోటీసుల్లో ఈసీ పేర్కొంది. కాగా, సీపీఐ (ఎంఎల్) ఎంపీ సుదామా ప్రసాద్ భార్యకు కూడా రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నట్లు ఈసీ వర్గాలు అంటున్నాయి. 

బిహార్​లో ఈసీ చేపట్టిన ఓటర్ల సవరణ జాబితా (సర్)పై వివాదం చెలరేగుతున్న వేళ తేజస్వి యాదవ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. కావాలనే ఓటర్లను ఈసీ తొలగిస్తున్నదని తేజస్వి యాదవ్​తోపాటు సీపీఐ(ఎంఎల్), కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సర్​కు వ్యతిరకంగా సుప్రీంకోర్టులో సీపీఐ(ఎంఎల్) కేసు కూడా వేసింది. ఇదిలాఉంటే.. తేజస్వి యాదవ్ కు రెండు ఓటర్​ ఐడీ కార్డులు ఉన్నట్లు తాజా పరిణామాలతో తేటతెల్లమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా అన్నారు. రెండు ఓటర్​ ఐడీ కార్డులు ఉండటం అనేది నేరమని, ఈ విషయంలో తేజస్వి యాదవ్​ను విచారించాలని ఆయన డిమాండ్​ చేశారు.