పోలింగ్ బూత్ రూల్స్ మారాయి.. ఇక నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఒకే చోట ఓటింగ్

పోలింగ్ బూత్ రూల్స్ మారాయి.. ఇక నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఒకే చోట ఓటింగ్
  • కొత్త పోలింగ్​ కేంద్రాలూ ఏర్పాటు చేయాలి : కలెక్టర్లకు సీఈఓ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను త్వరలో సరిచేయనున్నారు.  ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలని  అధికారులకు  సీఈఓ సుదర్శన్​ రెడ్డి స్పష్టం చేశారు.  సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు మరింత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.

"ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్‌లను విడగొట్టి, కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, కొత్త కాలనీలు, గుడిసెల సమీపంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలి. దీనికోసం ప్రత్యేక సర్వేలు నిర్వహించి, అనువైన ప్రదేశాలను గుర్తించండి" అని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే సౌలభ్యం కల్పించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల పనుల్లో సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా, నిబంధనలు, ఎన్నికల చట్టాలు, ఆధునిక కంప్యూటర్ సిస్టమ్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి, ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేయాలన్నారు. ఓటర్ ఐడీలో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే ఫారాలు నింపడంలో ప్రజలకు సహకరించాలని కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్  దిశానిర్దేశం చేశారు.