ఓటింగ్‌‌ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ

ఓటింగ్‌‌ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ
  • పబ్లిక్ యాప్ సర్వేలో 86 శాతం మంది వెల్లడి
  • ఇందులో 60 శాతం మంది 30 ఏండ్లలోపు వాళ్లే

న్యూఢిల్లీ: దేశంలో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని 86% మంది ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఓటింగ్ ప్రాసెస్‌‌పై తమకు నమ్మకముందని 80% మంది చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్ ‘పబ్లిక్ యాప్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 12వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మంగళవారం సర్వే ఫలితాలను రిలీజ్ చేశారు. ‘‘ఓటింగ్‌‌ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ. దేశ ప్రజల సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకం. ఓటింగ్‌‌ను తప్పనిసరి చేయాలని 86% మంది అభిప్రాయపడ్డారు” అని అందులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 60% మంది 30 ఏండ్ల లోపు వాళ్లే ఉన్నారు.

సర్వేలోని మరిన్ని వివరాలు
ప్రస్తుత ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత ఉందని 81 శాతం మంది నమ్ముతున్నారు. ఎవరికి ఓటు వేయాలనేది ఎలా నిర్ణయించుకుంటారనే దానికి.. ‘క్యాండిడేట్లు గత టర్మ్‌‌లో చేసిన పనులను చూసి’ అని 31% మంది చెప్పగా.. ‘పోటీలో నిలబడ్డ అభ్యర్థులందరి గురించి తెలుసుకుని’ అని 31% మంది చెప్పారు. పాపులారిటీ ఎవరికి ఉంటే వారికి ఓటేస్తామని 4.96% మంది, పార్టీని బట్టి ఓటు వేస్తామని 11.92% మంది చెప్పారు. 
వేరే సిటీలో ఉండటం వల్ల ఓటు వేయలేకపోతున్నారని 30.04% మంది అభిప్రాయపడగా, ఇప్పటిదాకా ఎన్నడూ తాము ఓటు మిస్ కాలేదని 56.3% మంది చెప్పారు. ఎన్నికల గురించి తెలియదని 5.22% మంది, తాము ఏ పార్టీకి సపోర్ట్ చేయకపోవడం వల్ల అని 7.19% మంది, తమకు ఆసక్తి లేకపోవడం వల్ల అని 1.27% మంది ఓటును మిస్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. కనీసం ఒక్కసారైనా ఓటు వేశామని 79.5% మంది చెప్పుకొచ్చారు.