అమెరికా Vs వెనిజులా: మా అధ్యక్షుడు బతికి ఉన్నాడో లేదో చూపించండి..

అమెరికా Vs వెనిజులా: మా అధ్యక్షుడు బతికి ఉన్నాడో లేదో చూపించండి..

కారకాస్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మదురో, ఆయన భార్యను వెనిజులా నుంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు మదురో, ఆయన భార్య ఎక్కడున్నారో తమకు తెలియదని.. వాళ్లు ప్రాణాలతోనే ఉన్నారని రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. వాళ్లు ప్రాణాలతో ఉన్నారా..? లేదా..? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. డెల్సీ రోడ్రిగ్జ్ వ్యాఖ్యలతో మదురో బతికి ఉన్నారా లేదా అని చర్చ మొదలైంది.

మరోవైపు.. వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో తమ దేశంపై జరిగిన  దాడులను ధృవీకరించారు. శనివారం (జనవరి 3) ఉదయం వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయని తెలిపారు. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ జరిపిందని తద్వారా ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇది వెనిజులా భూభాగంతో పాటు దేశ ప్రజలపై అమెరికా చేసిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. 

వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు:

శనివారం (జనవరి 3) తెల్లవారుజూమున వెనిజులాపై అమెరికా భీకర దాడులకు దిగింది. వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై అమెరికా దళాలు మెరుపు దాడులు చేశాయి. కారకాస్ సిటీలోని భారీ భవనాలు, పోర్టులే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో వెనిజులాలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో. 

ALSO READ : యుద్ధ విమానాల్లో వచ్చి వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన అమెరికా

ఈ దాడులను వెనిజులా భూభాగంతో పాటు దేశ ప్రజలపై అమెరికా చేసిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం ముందు అమెరికా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కారకాస్ సిటీతో పాటు మిరాండా, అరగువా, లా గుయిరా రాష్ట్రాలలో కూడా దాడులు జరిగాయని వెనిజులా ప్రభుత్వం తెలిపింది. 

అవును దాడులు మేమే చేశాం: ట్రంప్

వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై జరిగిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. వెనిజులాపై జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ అమెరికానే చేసిందని ఆయన అంగీకరించారు. దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించి అమెరికాకు తరలిస్తున్నాయని వెల్లడించారు. మదురోతో పాటు ఆయన భార్యను కూడా నిర్భంధించినట్లు తెలిపారు. 

ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా  ఫ్లాట్‎ఫామ్ ట్రూత్‎లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనిజులాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోపై పెద్ద ఎత్తున దాడిని విజయవంతంగా నిర్వహించింది. దాడుల అనంతరం మదురోతో పాటు అతడి భార్యను బంధించి అమెరికా తరలిస్తున్నాం. ఈ ఆపరేషన్ యుఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విమానాల్లో వచ్చి  వెనిజులాపై మెరుపు దాడులు చేయడమే కాకుండా ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే అమెరికా దళాలు ఎత్తుకెళ్లడం ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారింది.