వీఆర్ఏ కారుణ్య నియామకాలు చేపట్టాలి : కోదండరాం​

వీఆర్ఏ కారుణ్య నియామకాలు చేపట్టాలి : కోదండరాం​

ఖైరతాబాద్​,వెలుగు :  గత ప్రభుత్వం 2014 జూన్ 2 తర్వాత మృతిచెందిన వీఆర్ఏల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదని, వారసత్వం కింద వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రొఫెసర్​ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.  పూర్వ వీఆర్ఏల 5 నెలల పెండింగ్ సమస్యలను పరిష్కరించినందుకు సీఎం, రెవెన్యూమంత్రికి ఆ శాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా కోదండరాం హాజరై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను భ్రష్టుపట్టించి, రికార్డులను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. వీఆర్ఏలను ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేసి జిల్లాలు దాటించిందని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖకు వీఆర్ఏలు కళ్లు, చెవులు లాంటివారని, వారిని స్థానికంగానే ఉండేటట్టు నియమించాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్​అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే వారు లేకుండా రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఆగం చేసిందని విమర్శించారు. 

దీంతో జీతభత్యాలు రాక 20 వేల కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా.. ఈనెల2న సీఎంను కలవగా ఒక్కరోజులోనే సమస్యను పరిష్కరించారన్నారు. తహశీల్దార్ల సంఘం అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ ఐడీ నంబర్లు లేకపోగా ఆర్నెళ్లుగా జీతాలు లేవని, సీఎం వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో వీఆర్ఏల హక్కుల సాధన సమితి అధ్యక్షుడు సత్యనారాయణ , రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

కేసీఆర్ పాలనలో శ్రమ దోపిడీకి గురైన హోంగార్డులు

మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమదోపిడికి గురయ్యారని, వారిలో హోంగార్డులు కూడా ఉన్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అన్నారు. చాలీచాలని జీతాలు ఇస్తూ , సెలవులు లేకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు.  సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమా న వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ ఆఫీసులో   కోదండరాంను ఆల్ ఇండియా హోంగార్డ్ వెల్ఫేర్ అసోసియే షన్ నేతలు కలిశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హోంగార్డులకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కృషి చేయాలని అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణ విజ్ఞప్తి చేశారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని  కోదండరాం హామీ ఇచ్చారు.