టిక్ టాక్ లో యువతి పరిచయం.. భార్యను వదిలేసి ఆమెతో పెళ్లి

టిక్ టాక్ లో యువతి పరిచయం.. భార్యను వదిలేసి ఆమెతో పెళ్లి
  • కాపురం కూల్చిన టిక్ టాక్

విజయవాడ: సోషల్ మీడియా వీడియో యాప్.. టిక్ టాక్ అడిక్షన్ విపరీతాలకు కారణమవుతోంది. టిక్ టాక్ వీడియోల కోసం కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు జీవితాన్ని పక్కదారి పట్టించుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడలో ఓ మహిళ కాపురం కూల్చింది టిక్ టాక్ పిచ్చి. ఈ యాప్ లో పరిచయమైన యువతి కోసం కట్టుకున్న భార్యను వదిలేశాడతను. ఆ యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు.

విజయవాడ వీటీపీఎస్ కాలనీలో జరిగిందీ ఘటన. వీటీపీఎస్ లో ఉద్యోగం చేస్తున్న సత్యరాజు 2009లో అనురాధను పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లు గడుస్తున్నా వారికి సంతానం లేదు. దీంతో భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండేవాడతడు.

టిక్ టాక్ కలిపింది… అదే పట్టించింది

వారి మధ్య సరైన బంధం లేకపోవడంతో టిక్ టాక్ లో ఇటీవలే హైదరాబాద్ కు చెందిన వనిత అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు సత్యరాజు. ఆ పరిచయం.. పెళ్లి దాకా వెళ్లింది. అయితే ఈ విషయాన్ని భార్యకు తెలియకుండా కొన్నాళ్లు గుట్టుగా ఉంచాడు. కానీ, టిక్ టాక్ అడిక్షనే వారిని మొదటి భార్య అనురాధకు పట్టించింది. వనిత, సత్యరాజు కలిసి వీడియోలు చేసి.. టిక్ టాక్ లో పెట్టారు. ఇవి అనురాధ కంటపడడంతో ఆమె భర్తని నిలదీసింది. దీంతో అనురాధపై వేధింపులు ఎక్కువయ్యాయి. సత్యరాజు పెట్టే హింస తట్టుకోలేక ఆమె ఇవాళ ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్లో  భర్త సత్యరాజుపై పిర్యాదు చేసింది.