
టీ20 ప్రపంచ కప్‌లో కీలక మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. దాయాదుల పోరులో ఎవరు గెలిచినా ఫ్యాన్స్‌కు మాత్రం కిక్కు ఖాయం. ఫైనల్ లాంటి ఈ మ్యాచ్‌లో నెగ్గడానికి ఇరు జట్లు అన్ని శాయశక్తులా పోరాడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండాలో లెజెండరీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ సూచిస్తున్నారు. బౌలింగ్ వేస్తాడో లేదో సందేహంగా ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యాను జట్టులో చేర్చాలని లక్ష్మణ్ అన్నాడు. అయితే టాప్ స్పిన్నర్ అశ్విన్‌ను టీమ్‌లో చేర్చాలని తాను భావించడం లేదన్నాడు.
‘టీమిండియాకు ఎన్నో ఛాయిస్‌లు ఉన్నాయి. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మూడో నంబర్‌లో విరాట్ కోహ్లీని ఆడించాలి. నాలుగు, ఐదు,ఆరు స్థానాల్లో సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలను తీసుకోవాలి. ఆల్‌రౌండర్‌గా జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. భువనేశ్వర్, బుమ్రా పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్ కోసం వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్‌ను రంగంలోకి దించాలి’ అని లక్ష్మణ్ చెప్పాడు. ప్రపంచ కప్ పూల్ 2లో ఉన్న భారత్.. వరుసగా పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.