
- ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఫేస్‌బుక్
న్యూఢిల్లీ: ఒక్కోసారి చిన్నపాటి సమస్యలకే కుంగిపోతుంటాం. ప్రాబ్లమ్ వస్తే దాన్ని పరిష్కరించేదాకా తీవ్ర ఒత్తిడికి లోనవుతాం. అలాంటిది ఒకేసారి కష్టాలన్నీ కట్టకట్టుకు పైనబడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి (43). మూడేళ్ల కింద భార్య వదిలివెళ్లిపోవడం, ఏడాది కింద ఉద్యోగం పోవడంతోపాటు ట్రీట్‌మెంట్‌కు నయంకాని అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తిని తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. దీంతో భోపాల్‌లో ఉంటున్న తన భార్యకు కాల్ చేసి చూడాలని ఉందన్నాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో 50 బాటిళ్ల సిరప్ తాగేశాడు. అలా తాగుతూ ఫేస్‌బుక్‌లో లైవ్ పోస్ట్ పెట్టాడు.
ఒకరకంగా ఫేస్‌బుక్ లైవ్ పెట్టడమే యువకుడి ప్రాణాల్ని కాపాడిందని ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 1.30కు ఆ వ్యక్తి సూసైడ్ కు ప్రయత్నించగా.. వెంటనే ఫేస్‌బుక్ నిర్వాహకులు ఈ విషయాన్ని మెయిల్ ద్వారా పోలీసులకు తెలియజేశారు. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో ఉంటున్నట్లు గుర్తించి అతడ్ని కాపాడామని డిప్యూటీ కమిషనర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు.