నెలలోగా సింగరేణి కార్మికులకు .. వేజ్​బోర్డు బకాయిలు

నెలలోగా సింగరేణి కార్మికులకు .. వేజ్​బోర్డు బకాయిలు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి కార్మికులకు 11 వేజ్​ బోర్డు ఒప్పంద బకాయిలు రూ.1,726 కోట్లను నెలలోగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్​(ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం​నాయక్​ తెలిపారు. 23 నెలలకు సంబంధించిన వేజ్​ బోర్డు బకాయిలను కార్మికులకు చెల్లించాల్సి ఉందని, ఇందు కోసం అన్ని విభాగాలను సన్నద్ధం చేస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రూ.1,726 కోట్లను బకాయిలుగా చెల్లించనున్నామని, యావరేజ్​గా ఒక్కో కార్మికుడికి రూ.4 లక్షల వరకు అందుతాయని వెల్లడించారు. 

సింగరేణి చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించడం ఇదే మొదటిసారి అని, నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా కార్మికుల ఖాతాల్లో వాటిని జమచేస్తామన్నారు. 11వ వేజ్​బోర్డు వేతనాలను అందరికన్నా ముందు సింగరేణిలో అమలు చేస్తామన్నారు. దీంతో కంపెనీపై ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగులకు మొదట ఎరియర్స్​ చెల్లించిన తర్వాత పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లిస్తామని చెప్పారు.