
- అనుమతి ఉంటేనే మీటర్..
- బోర్లు వేసుకొని రైతుల ఎదురు చూపులు
- వేసిన పంటలెండుతాయని ఆవేదన
- రెండు వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు వాల్టా అనుమతి తప్పనిసరి చేస్తూ ట్రాన్స్ కో ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నడూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు వాల్టా చట్టం నిబంధనను అమలు చేయకున్నా ఇటీవలే ఈ చట్టం అమలుకు ఆశాఖ అధికారులు సీరియస్ గా చర్యలు మొదలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు ఇప్పటికే బోరు బావులు వేసుకొని కరెంట్కనెక్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే అధికారులు మాత్రం తహసీల్దార్ నుంచి వాల్టా చట్టానికి లోబడే బోరుబావి తవ్వుకున్నట్లు సర్టిఫికెట్ తేవాలంటూ నిబంధన పెడుతున్నారు. అప్పుడే కరెంట్కనెక్షన్ ఇస్తామని, లేదంటే సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోనే 2318 మంది రైతులు..
ఒక్క నిర్మల్ జిల్లాలోనే ఇలా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 2318 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే 68 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇటీవల విద్యుత్ వినియోగం పెరగడం, భూగర్భ జలాల శాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బోరు బావుల తవ్వకానికి వాల్టా చట్టాన్ని తప్పనిసరి చేసింది. ఈ కారణంగా విద్యుత్ శాఖ ముందస్తుగా అప్రమత్తమై వ్యవసాయ కరెంట్కనెక్షన్ కోసం వాల్టా చట్టం అనుమతిని తహసీల్దార్ ద్వారా పొందాలని నిబంధన విధించింది. రైతులు మాత్రం ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బోరుబావులు తవ్వుకున్నామని, రూ.లక్షల పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. వాటికి కరెంట్కనెక్షన్లు మంజూరవుతాయన్న ఆశతో పంటలను కూడా సాగు చేస్తున్నామని, విద్యుత్ అధికారులు కనెక్షన్ మంజూరు చేయకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. ఇంకా ఆలస్యమైతే నీరందక పంటలన్నీ ఎండిపోతాయని, మరింత నష్టపోతామంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పటికైతే మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ రైతాంగంలో పెరుగుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో అధికార పార్టీకి చెందిన సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశం కలెక్టర్ పరిధిలో ఉన్నందున తామేమి చేయలేమంటూ విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సవాలక్ష నిబంధనలు...
బోరు తవ్వకానికి సవాలక్ష నిబంధనలు ఉ న్నాయని రైతులు చెబుతున్నారు. తహసీల్దార్ కు అర్జి పెట్టుకుని అక్కడి నుంచి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ)ను జారీ చేయాలంటున్నారు. తర్వాత తహసీల్దార్ వాల్టా చట్టం నుంచి మినహాయింపునిస్తూ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బోరు తవ్వుకొని కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించాక విద్యుత్ శాఖ అధికారులు రైతులకు వ్యవసాయ కనెక్షన్ ను మంజూరు చేస్తారు. రైతులు ఉచిత విద్యుత్ పేరిట ఇష్టానుసారంగా బోరుబావులు తవ్వుతున్నారని, విద్యుత్ వినియోగం పెరుగుతున్న కారణంగానే వాల్టా చట్టాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కరెంట్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం..
తన భూమిలో బోరు వేసుకొని రెండు నెలలైతుంది. ఇప్పటికీ కరెంట్ కనెక్షన్ ఇయ్యలేదు. తహసీల్దార్ సర్టిఫికెట్ తెమ్మని కరెంట్ సార్లు అంటున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట వేసిన. పక్క బోరు నుంచి కొంత నీరును వాడుకున్నా. ఇప్పుడు కరెంట్ కనెక్షన్ రాకపోతే తన పంట ఎండిపోయే పరిస్థితి ఉంది.
- నర్సయ్య, రైతు, సారంగాపూర్ మండలం.
వాల్టా చట్టం సర్టిఫికెట్ తప్పనిసరి..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ జారీకి తహసీల్దార్ నుంచి వాల్టా చట్టం సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలి. ఇటీవలే దీనిపై తమకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సర్టిఫికెట్ లేకుండా కనెక్షన్ మంజూరు కాదు. మినహాయింపు అంశం తమ పరిధిలో లేదు. జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - జేఆర్ చౌహన్, ఎస్ఈ, విద్యుత్ శాఖ