వాల్తేరు వీరయ్య.. కమర్షియల్ ఎంటర్ టైనర్: రివ్యూ

వాల్తేరు వీరయ్య.. కమర్షియల్ ఎంటర్ టైనర్: రివ్యూ

గాఢ్ ఫాదర్ హిట్టు తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్ర వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీలో  మహారాజా రవితేజ, శృతిహాసన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.  ఎన్నో అంచనాల మధ్య రిలీజైన వాల్తేరు వీరయ్య..ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు..? సంక్రాంతి విన్నర్గా వీరయ్య నిలిచాడా..?

కథలోకి వెళ్తే...

వాల్తేరు పోలీస్ స్టేషన్ నుంచి అం ఇంటర్నేషనల్  మాఫియా డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ (బాబీ సింహ)  తప్పించుకుని  మలేషియాకు పారిపోతాడు.  దీంతో పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్రప్రసాద్)  సస్పెండ్ అవుతాడు. అయితే సల్మాన్ సీజర్‌ను మలేషియా నుంచి తీసుకురావడానికి సీతాపతి వాల్తేరులోని జాలరి వీరయ్యతో ఒప్పందం కుదుర్చుకుంటాడు.  మలేషియాకు వెళ్లిన వీరయ్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వాల్తేరులో జాలరిగా పనిచేసిన మైఖేల్ ( ప్రకాశ్ రాజ్) ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్‌గా ఎలా ఎదిగాడు. వీరిద్దమరి మధ్య సంబంధం ఏంటి...? మలేషియాలో అతిథి (శృతిహాసన్) ఏం చేస్తుంది.  వాల్తేరు వీరయ్యకు  విక్రమ్ సాగర్ (రవితేజ) ఏమవుతాడు....? విక్రమ్ సాగర్ భార్య (క్యాథరీన్ త్రెసా) వాల్తేరు వీరయ్య అంటే ఎందుకు కోపం. విక్రమ్ సాగర్ చివరి కోరిక ఏంటీ...? దాన్ని వాల్తేరు వీరయ్య తీర్చాడా? సల్మాన్‌ను వీరయ్య  ఇండియాకు తీసుకొచ్చాడా..? అనేది వాల్తేరు వీరయ్య అసలు సినిమా.

ఎలా ఉందంటే.?

ఫస్టాఫ్ ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్‌  సల్మాన్ తప్పించుకుపోవడం, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్ గురి కావడం లాంటి సన్నివేశాలతో స్టోరీ  నార్మల్‌గానే మొదలవుతుంది.  సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ సహాయం కోసం వెళ్లడంతో వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్  ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మోతమోగుతుంది. ఆ తర్వాత బాస్ పార్టీ, ఫైట్లతో కమర్షియల్ ఫార్మాట్‌తో కొనసాగి..మలేషియాలో  శృతిహాసన్తో  రొమాంటిక్‌ మూడ్ లోకి వెళ్లిపోతుంది.  ఇందులో జగదేకవీరుడు అతిలోక సుందరి పాటపై శృతి, చిరంజీవి స్టెప్పులు ఫ్యాన్స్‌కు కిక్కిస్తాయి. ఆ తర్వాత అద్భుతమైన సీన్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. 

రవితేజ ఎంట్రీ అదుర్స్...

సెకండాఫ్‌లో రవితేజ ఎంట్రీ  పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ కొద్దిగా రొటీన్, రెగ్యులర్‌ సీన్స్గా అనిపిస్తాయి. విక్రమ్ సాగర్, వాల్తేరు వీరయ్య మధ్య ఉండే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. అయితే  సల్మాన్ సీజర్‌ను చంపే ఎపిసోడ్ మాత్రం హైలెట్. ఇక రెగ్యులర్ ఫార్మాట్‌లో క్లైమాక్స్ ముగియంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. 

వాల్తేరు వీరయ్య కథ కొత్త కథ కాదు. కథ పాతదే అయినా..కొత్త ఎంటర్టైన్మెంట్ ను అద్ది సరికొత్తగా చెప్పారు.  అయితే చిరంజీవి వంటి మెగాస్టార్ ఇమేజ్ ని బాబీ  మేనేజ్ చేశారని చెప్పొచ్చు. ఇద్దరు మాస్ స్టార్స్ ఉండటం డైరక్టర్ కు  పెద్ద టాస్క్.  దర్శకుడు,రచయిత  బాబి చాలా వరకూ ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మధ్య స్ట్రాంగ్ గా సీన్స్ పెట్టుకోకపోవడం మైనస్ పాయింట్. చిరంజీవితో వింటేజ్ ఫన్ చేసి, భారీ ఫైట్ తో ఇంట్రవెల్ ను ముగించే వరకు బాగానే ఉంది. అయితే  సెకండాఫ్ లో రవితేజ ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్ విక్రమార్కుడు గుర్తు చేసేలా ఆసక్తిగా చూపారు. అయితే  రవితేజ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే సినిమా క్లైమాక్స్ కు  వెళ్లిపోతుంది. చిరంజీవి పాత్ర విలన్ ని ఎదుర్కొనే ఎపిసోడ్స్ సెకండాఫ్ లో ఉంటే బాగుండు. చిరు కారెక్టర్  ఫస్టాఫ్ ఉన్నంత జోరుగా ..ఉషారుగా సెకండాఫ్ కనిపించదు. అన్న,దమ్ముల సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు. 

చిరంజీవి ఎలా చేసారంటే...

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గెటప్, హావభావాలు  ముఠా మేస్త్రిని గుర్తు తెస్తాయి.  కలర్ ఫుల్ చొక్కా,  లుంగీ ధరించి.... మెడలో బంగారం గొలుసులు, చెవి పోగు, చేతికి గడియారం, బ్లాక్ బూట్స్ లో  ఫ్యాన్స్ ను  ఫిదా చేశారు. గెటప్ లో డైలాగ్స్, స్టెప్స్ తో  మెగాస్టార్   ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.  బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్  అన్నీ  ఫుల్ సెట్ అయ్యాయి.

రవితేజ ఫెర్ఫార్మెన్స్..

ఈ సినిమాలో  రవితేజ‌ ఇమేజ్‌కు తగినట్టుగా డైరెక్టర్ బాబీ సన్నివేశాలను ప్లాన్ చేసుకున్నారు. సెకండాఫ్‌లో చిత్రానికి మరింత మైలేజ్ తెచ్చే విధంగా రవితేజ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు. ఇక రవితేజ తనదైన స్టైల్, నటనతో ఆకట్టుకున్నారు. బాబీ సింహా, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఇతర పాత్రలు పర్వాలేదనిపించాయి. అటు  శృతిహాసన్ కొన్ని సీన్లలో ఆకట్టుకున్నా..ఎక్కువగా  గ్లామర్‌కే పరిమితమైంది. శ్రీదేవీ సాంగ్, మరో పాటలో చిరంజీవితో కలిసి కేక పెట్టించింది. 

వాల్తేరు వీరయ్యకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్. అయితే  కొన్ని సీన్లలో అవసరం లేకున్నా..మ్యూజిక్తో ఇబ్బంది పెట్టారనిపిస్తుంది. ఇక ఆర్ట్ విభాగం ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పొచ్చు. మిగితా విభాగాలు ఫర్యాలేదనిపిస్తాయి. ఫైనల్‌గా వాల్తేరు వీరయ్య మూవీ ఎలా ఉందంటే....ఇది పక్కా కమర్షియల్ ఎంటరైనర్. చిరంజీవి, రవితేజ ఇమేజ్‌కు ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో..డైరెక్టర్ బాబీ వారికి నచ్చే విధంగా తెరకెక్కించారు.  సంక్రాంతి పండుగ కావడంతో...ఫ్యామిలీతో  సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయోచ్చు.