
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : ఎన్నికల నిర్వహణలో పీవోల పాత్ర కీలకమని, నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పీవోలు, ఏపీవోలకు ఈనెల 6న నిర్వహించే ఒకరోజు శిక్షణ కార్యక్రమంపై ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ప్రీసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉన్నప్పుడే పీవోలు సక్రమంగా పోలింగ్ నిర్వహించగలరని తెలిపారు.
పీవోలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలని, నిబంధనలతోపాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణకు వచ్చే పీవోలకు పోస్టల్ బ్యాలట్ ఫారం –14 కూడా అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏం జరిగినా పీవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీపీవో రఘనాథ్, డిప్యూటీ సీఈవో రామమహేశ్వర్ రెడ్డి, డీఈవో అబ్దుల్ ఘని, ఏవో భానుప్రకాశ్, అధికారులు
తదితరులు పాల్గొన్నారు.