వర్షాల నేపథ్యంలో ప్రజలకు ముందస్తు చర్యలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

 వర్షాల నేపథ్యంలో ప్రజలకు ముందస్తు చర్యలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: వర్షాల నేపథ్యంలో వనపర్తి జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇప్పటికే పారిశుధ్యం, డ్రై డే కార్యక్రమాలు చేపట్టామన్నారు. వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్​కలెక్టర్ (రెవెన్యూ) జి.వెంకటేశ్వర్లు, అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెల 25 నుంచి వచ్చే నెల10వ తేదీ వరకు మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

జిల్లాలో ఎన్ని ఎరువుల దుకాణాలు ఉన్నాయి, వాటిలో ఎరువుల లభ్యతపై బోర్డులు పెట్టేలా యజమానులకు సూచనలు చేయాలని చెప్పారు. వ్యవసాయానికి నీటి లభ్యత, అవసరానికి అనుగుణంగా నీటిని విడుదల చేసేలా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ముందస్తు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించి మాక్​డ్రిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి విషయంలో ప్రతీరోజు ఇన్​ఫ్లో, ఔట్​ఫ్లో వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. అంటువ్యాధుల విషయంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.