
గోపాలపేట, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం మండలంలోని పోల్కే పహాడ్, చాకలిపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. పోల్కే పహాడ్ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. రైతుల అర్జీలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన పాత ఆర్వోఆర్ రిజిస్టర్, పహాణీ తదితర రికార్డులను పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో రైతులు సదస్సుకు వస్తున్నారని చెప్పారు. బుధవారం మండలంలోని పోల్కే పహాడ్ లో 44, చాకలిపల్లిలో 29 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రాజు, డీటీ తిలక్ రెడ్డి ఉన్నారు.
నిబంధనల మేరకే కొనుగోళ్లు
వనపర్తి: ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుగుణంగా వడ్ల కొనుగోలు జరిగేలా చూడాల్సిన బాధ్యత అగ్రికల్చర్ ఆఫీసర్లపై ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఏవోలు, ఏఈవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. చాలా చోట్ల వడ్లలో తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపించిందని తెలిపారు. నాణ్యమైన వడ్లు ఇవ్వకుంటే మిల్లర్లు తీసుకోడానికి వెనకాడతారని, వారి నుంచి నాణ్యమైన బియ్యం సేకరించాల్సి ఉంటుందన్నారు.
ఏవోలు, ఏఈవోలు సెంటర్లను సందర్శించి వడ్లలో గడ్డి, తాలు, మట్టి లేకుండా చూడాలని సూచించారు. నాణ్యమైన వడ్లను మిల్లర్లు సకాలంలో దించుకోకున్నా, తరుగు పేరుతో కోతలు విధించినా మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఏవో గోవింద్ నాయక్, డీఎస్వో విశ్వనాథ్, డీసీవో రాణి పాల్గొన్నారు.