
- నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా జరిపేందుకు అధికారులు సిద్ధం
- ఓటర్లు 3,86,605 మంది
వనపర్తి, వెలుగు: సెప్టెంబర్నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వనపర్తి జిల్లా యంత్రాంగం అందుకు తగ్గట్టుగా రెడీ అవుతోంది. నోటిఫికేషన్ఎప్పుడొచ్చినా ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కొత్తగా ఏదుల మండలం ఏర్పడడంతో ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ స్థానంతోపాటు 13 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. గ్రామీణ ఓటర్లు 3,86,605 మంది ఉన్నారు.
అదనంగా 20 శాతం బ్యాలెట్ బాక్సులు
జిల్లాలో 656 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక్కో బ్యాలెట్ బాక్సు చొప్పున ఏర్పాటు చేసినప్పటికీ ఏవైనా అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయంగా మరో 20 శాతం బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, ఒక పోలింగ్ ఆఫీసర్, నలుగురు అసిస్టెంట్ పోలింగ్ఆఫీసర్లు, సిబ్బందిని నియమిస్తారు. 700 మంది దాటితే అదనంగా మరో అసిస్టెంట్పోలింగ్ఆఫీసర్ను కేటాయిస్తారు.
మండలాలకు కవర్లు, పేపర్లు
స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రతీ మండలానికి అవసరమైన కవర్లు, పేపర్లు పంపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, రిజర్వేషన్లు ఖరారయ్యాక సుతిలీ, బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేరులోని తెలుగు అక్షరాల ఆరోహణ క్రమంగా పార్టీ గుర్తులను కేటాయిస్తారు. జడ్పీటీసీ బ్యాలెట్పేపర్ను వైట్కలర్లో, ఎంపీటీసీ బ్యాలెట్పేపర్ ను పింక్కలర్లో ముద్రిస్తారు. ఒక ఓటరు ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటేసి, రెండు పేపర్లను బ్యాలెట్బాక్సుల్లో వేయాలి.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రిటర్నింగ్ఆఫీసర్లకు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చాక పోలింగ్ ఆఫీసర్లకూ శిక్షణనిస్తారు. ఈ విషయమై జడ్పీ డిప్యూటీ సీఈవో రామమహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు జరిపేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. ముందస్తుగా ఎన్నికలకు కావాల్సిన సామగ్రి, ఇతరత్రా పనులను చక్కదిద్దామని పేర్కొన్నారు.