
వనపర్తి , వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. సోమవారం ప్రజావాణి హాల్‌లో అధికారులకు వన మహోత్సవంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 21 లక్షల మొక్కల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి గ్రామం, మండలం, మున్సిపాలిటీకి సంబంధించిన నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు.
మొక్కలు నాటిన నెల రోజుల్లో మళ్లీ వాటి ఫొటోలు తీసి పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి (ఇన్చార్జి) సత్యనారాయణ, డీఆర్డీవో ఉమాదేవి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో 25 ఫిర్యాదులు
పాలమూరు, వెలుగు: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి ప్రతి ఫిర్యాదుదారుడికి వెంటనే న్యాయం చేయడమే లక్ష్యమని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల వచ్చిన ప్రజల నుంచి 25 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బందితో నేరుగా మాట్లాడి, ప్రతీ ఫిర్యాదును చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాధాత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.