వడ్ల కొనుగోళ్లపై నజర్.. వనపర్తి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం

వడ్ల కొనుగోళ్లపై నజర్..  వనపర్తి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం

 

  • 430 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

వనపర్తి, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ ఏడాది వనపర్తి జిల్లాలో నిరుడు కంటే ఎక్కువగా వరి సాగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్​గా ఇస్తుండడంతో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపారు. జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు చర్యలు ప్రారంభించారు. వడ్ల కొనుగోళ్లలో గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా వానాకాలం వడ్లు కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.

పెరిగిన సాగు విస్తీర్ణం.. 

గత ఏడాది ఖరీఫ్ లో 2,41,616 ఎకరాలలో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,47,813 ఎకరాలలో పంటలు వేశారు. నిరుడు వరి సాగు విస్తీర్ణం 1.90 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 2.15 లక్షల ఎకరాలకు పెరిగింది. అనధికారికంగా వరి సాగు మరింత ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిరుడు ఖరీఫ్​లో 297 కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. 

అయితే  సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలను ఓపెన్​ చేయడంతో ఈ సంఖ్య 379కి చేరుకుంది. ఈ ఏడాది కూడా మాదిరిగానే సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలను ఓపెన్​ చేయనున్నారు. 4.30 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా 430 సెంటర్లు ఓపెన్​ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి పంటకు పెద్దగా చీడ పీడలు లేకపోవడంతో దిగుబడి ఆశించిన స్థాయిలో వస్తుందని రైతులు చెబుతున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలకు పొలాల్లో నీరు చేరి కొంతమేర నష్టం జరిగిందని అంటున్నారు.

ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆఫీసర్లు..

గత సీజన్​లో వడ్లలో తాలు, చెత్త ఉందని కొందరు మిల్లర్లు కొర్రీలు పెట్టారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈసారి అన్ని సెంటర్లలో ప్యాడీ క్లీనర్లను తెప్పించి వడ్లు శుభ్రంగా ఉండేలా, నిర్దేశించిన తేమ శాతం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్​కలెక్టర్​ ఖీమ్యానాయక్​ తెలిపారు. గత సీజన్​కు సంబంధించిన సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్లకు వడ్లు కేటాయించవద్దని నిర్ణయించారు. సీఎంఆర్​ పూర్తి చేసిన వారికి సైతం బ్యాంక్​ గ్యారంటీ ఇస్తేనే వడ్లు కేటాయించనున్నారు.

దీంతో డీఫాల్టర్​ ఉన్నా, సీఎంఆర్​ పెండింగ్​ ఉన్న మిల్లర్లకు ఈసారి వడ్లు కేటాయించమని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు మొదలవడంతో, కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. కాంటాలు, గోనె సంచులు, వర్షానికి వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. వడ్ల దిగుబడి అంచనా మేరకు ఈసారి కోటి గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు గుర్తించారు. అలాగే సన్నాలను గుర్తించడంలో ఇప్పటికే కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించగా, మరోసారి మీటింగ్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.