ఎక్కువ వడ్డీ కావాలా ? ఇచ్చే బ్యాంకులు ఇవే

ఎక్కువ వడ్డీ కావాలా ? ఇచ్చే బ్యాంకులు ఇవే

బిజినెస్​డెస్క్​, వెలుగు: ఆర్​బీఐ ఇటీవల మరోసారి వడ్డీరేట్లను పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు కూడా డిపాజిట్లపై, లోన్లపై  వడ్డీరేట్లను పెంచాయి. వీటిలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్​బీ)లు ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ల  (ఎఫ్​డీలు) ఏడాదికి భారీ వడ్డీ ఇస్తున్నాయి.   కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ),  బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వంటి ప్రభుత్వ-యాజమాన్య బ్యాంకులు 7 శాతం వరకు ఎఫ్​డీ వడ్డీ రేటును ఇస్తున్నాయి. వడ్డీరేటు ఎక్కువ కాబట్టి ఇన్​ఫ్లేషన్ ఎఫెక్ట్​ను కూడా తట్టుకోవచ్చు. ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో చూద్దాం.

కెనరా బ్యాంక్ : 

ఈ ప్రభుత్వ-యాజమాన్య బ్యాంకు సంవత్సరానికి ఎఫ్​డీలపై 3.25 శాతం నుంచి  6.75 శాతం వరకు  వడ్డీ రేటును అందిస్తోంది. 7 నుంచి 45 రోజుల ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ అందించే వడ్డీ రేటు 3.25 శాతం ఉంది. ఇది 46 రోజుల నుంచి 90 రోజుల వరకు, 91 నుంచి 179 రోజుల వరకు కూడా 4.50 శాతం వడ్డీ ఉంటుంది.  180 నుంచి 269 రోజులు,  270 నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలానికి 5.50 శాతం వడ్డీ పొందవచ్చు.  ఒక సంవత్సరం టెన్యూర్​కి 6.75 శాతం రాబడిని అందిస్తోంది.   సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ టెన్యూర్​కి వడ్డీ రేటు 6.80 శాతం.  అయితే 666 రోజుల టెన్యూర్​ కోసం ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 7 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. 2 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ  నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వరకు వడ్డీరేటు 6.80 శాతం కాగా, మూడు సంవత్సరాలు–ఐదు సంవత్సరాల ఎఫ్​డీపై వడ్డీ రేటు 6.75 శాతం. ఐదు సంవత్సరాలు,  అంతకంటే ఎక్కువ కాలం పాటు పన్ను ఆదా చేసే ఎఫ్​డీలపై వడ్డీ రేటు 6.50 శాతం ఉంటుంది. పైన పేర్కొన్న కెనరా బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వర్తిస్తాయి  ఈ రేట్లు 19 డిసెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) :

 ప్రభుత్వ యాజమాన్యంలోని పీఎన్​బీ తన ఎఫ్​డీ వడ్డీ రేట్లను 2023 జనవరి 1 నుంచి మార్చింది. ఇక నుంచి ఒక సంవత్సరం,  సంవత్సరం నుంచి 665 రోజులు, 667 రోజుల నుంచి రెండు సంవత్సరాలతో పాటు, రెండు, మూడు సంవత్సరాలకు పైబడిన ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించింది.  ఒక సంవత్సరం  అంత కంటే ఎక్కువ, ఏడాది నుంచి 665 రోజుల వరకు గల డిపాజిట్లపై వడ్డీ రేటు వార్షికంగా 6.75 శాతంగా ఉంది. గతంలో రాబడి 6.35 శాతమే ఉండేది.  667 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు, రెండు సంవత్సరాల కంటే ఎక్కువ & 3 సంవత్సరాల వరకు ఎఫ్​డీ రేట్లను 6.75 శాతానికి పెంచింది. అంతకు ముందు 667 రోజుల నుంచి 2 సంవత్సరాల కాలానికి పీఎన్​బీ ఎఫ్​డీ వడ్డీ రేటు 6.30 శాతం ఉండేది. అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ & 3 సంవత్సరాల వరకు పీఎన్​బీ డిపాజిట్లపై ఎఫ్​డీ రాబడి 6.25 శాతం ఉండేది. 666 రోజుల ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై పీఎన్​బీ 7.25 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది.  సీనియర్ సిటిజన్‌‌లకు అన్ని టెన్యూర్లపై అదనంగా 50 బేసిస్​ పాయింట్లు ఎఫ్​డీ రేటును అందిస్తోంది.  సూపర్ సీనియర్ సిటిజన్‌‌లకు అదనంగా 30 బీపీఎస్​ రిటర్న్‌‌ను అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) : 

ఈ బ్యాంకు కొత్త వడ్డీరేట్లు పోయిన డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ కింద 399 రోజుల టెన్యూర్​ కోసం టర్మ్ డిపాజిట్లపై 7.05 శాతం రాబడి ఇస్తోంది.  ప్రభుత్వ -యాజమాన్య బ్యాంకుల్లో ఈ టెన్యూర్​లో అత్యధిక రేటు ఇదే. సాధారణ ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 3 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉన్నాయి. ఇతర బ్యాంకుల మాదిరిగానే, ఇది కూడా సీనియర్ సిటిజన్‌‌లకు వారి ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్​ పాయింట్ల రిటర్న్‌‌ను అందిస్తుంది. ఐదు సంవత్సరాలు  అంతకంటే ఎక్కువ కాలం పాటు పన్ను ఆదా చేసే ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై,  ఎఫ్​డీ రేటు 6.25 శాతం ఉంది.