అసెంబ్లీ ఎన్నికల్లో RJD గెలిస్తే.. చెత్తబుట్టలో వక్ఫ్ సవరణ బిల్లు: తేజస్వి యాదవ్

అసెంబ్లీ ఎన్నికల్లో RJD గెలిస్తే.. చెత్తబుట్టలో వక్ఫ్ సవరణ బిల్లు: తేజస్వి యాదవ్

పాట్నా: పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన వివాదస్పద వక్ఫ్ సవరణ బిల్లుపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ గెలిస్తే.. వక్ఫ్ సవరణ బిల్లు చెత్తబుట్టలో పడుతుందని అన్నారు. శనివారం (ఏప్రిల్ 5) పాట్నాలో తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింల హక్కులను కాలరాసేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమ పార్టీ (ఆర్జేడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. 

బిల్లు ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిరూపించడానికి జేడీయూ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. కానీ దాంట్లో వాళ్లు విజయం సాధించలేదని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా మాట్లాడాలని జేడీయూ తమ పార్టీ నేతలను ఏ విధంగా ఒత్తిడి చేసిందో మనందరం చూశాం.. ఇది వారి అపజయమని విమర్శించారు. మతపరమైన వ్యవహారాల స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నందున వక్ఫ్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో ఆర్జేడీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారని తేజస్వీ తెలిపారు.

దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే విభజన రాజకీయాల్లో భాగంగా బీజేపీ ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ గెలిచి మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లు చెత్త బుట్టలో వేస్తామని తేల్చి చెప్పారు. బీజేపీ ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంది.. రేపు సిక్కులు, క్రైస్తవులకు కూడా ఈ పరిస్థితి రావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ మతపరమైన మైనారిటీలు, మండల్ హిందువులు, -గిరిజనులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు వ్యతిరేకంగా ఉంటాయని ఆరోపించారు.

మేం అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచితే.. బీజేపీ మద్దతుదారులు దాఖలు హైకోర్టును ఆశ్రయించారని.. దీంతో కోర్టు ఆ రిజర్వేషన్లు రద్దు చేసిందని ఫైర్ అయ్యారు. 2025 అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకే బీజేపీ సీఎం నితీష్ కుమార్‎తో పొత్తు పెట్టుకుంటుందని.. ఆ తర్వాత నితీష్‎ను దూరం పెడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం నితీష్ పరిస్థితి ఏంటో చిన్నపిల్లవాడికి కూడా తెలుసని సెటైర్ వేశారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాస్తోందని.. రాజ్యాంగానికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, మహ్మద్ జావేద్, ఆప్, ఆర్జేడీ మరో అడుగు ముందుకేసి వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.