War 2 Review: 'వార్ 2' ఫుల్ రివ్యూ: హృతిక్ - ఎన్టీఆర్ పోరులో విజయం ఎవరిది?

War 2 Review: 'వార్ 2' ఫుల్ రివ్యూ: హృతిక్ - ఎన్టీఆర్ పోరులో విజయం ఎవరిది?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan ), టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ) కలిసి నటించిన చిత్రం "వార్ 2' ( War 2 )ఈ రోజు ( ఆగస్టు 14) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి పార్ట్ 'వార్ ' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.  ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. లేదో చూద్దాం..

కథాంశం. 
'వార్ 2' కథ కబీర్ (హృతిక్ రోషన్) అనే RAW ఏజెంట్‌తో మొదలవుతుంది. దేశాన్ని ప్రమాదం నుండి కాపాడటానికి చేసే ఒక మిషన్‌లో కబీర్ తన గురువు అయిన లూథ్రా (అశుతోష్ రాణా)ను చంపి, రా ఏజెన్సీ నుండి తప్పించుకుంటాడు. కబీర్ చర్యలకు షాక్ అయిన RAW సంస్థ, అతడిని పట్టుకోవడానికి తమ కొత్త, అత్యంత సమర్థవంతమైన ఏజెంట్ అయిన విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్  )ని రంగంలోకి దించుతుంది.  

కబీర్ , విక్రమ్‌లు గతంలో మంచి స్నేహితులు , సహచరులు. అయితే ఒకప్పుడు ఒకరినొకరు నమ్ముకున్న ఈ ఇద్దరు గూఢచారులు, ఇప్పుడు ఒకరిపై ఒకరు పోరాడుకునే పరిస్థితుల్లో చిక్కుకుంటారు. తన గురువు లూథ్రాను కబీర్ చంపడం వెనుక ఉన్న కారణం ఏమిటీ? విక్రమ్ తన స్నేహితుడిని పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? వారిద్దరి మధ్య ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? కబీర్ నిజంగా విలన్ గా మారాడా? లూథ్రా కూమార్తె వింగ్ కమాండెర్ కావ్య లూథ్రా ( కియారా అద్వానీ ) ఉన్న సంబంధం ఏమిటీ?  కలి కార్టెల్ వెనకున్న అజ్ఞాత శక్తులు ఎవరు?. ఈ ప్రశ్నలకు సినిమా కథనం ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తుంది. సినిమా మొత్తం యాక్షన్, ఎమోషన్స్, అనూహ్యమైన ట్విస్ట్‌లతో నిండి ఉంటుంది.

నటీనటుల ప్రదర్శన
హృతిక్ రోషన్ తన కబీర్ పాత్రలో మరోసారి మెరిసారు. స్టైల్, యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఆయన ప్రదర్శన చాలా బాగుంది. ముఖ్యంగా, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్. విషయానికి వస్తే విక్రమ్ పాత్రలో తనదైన ముద్ర వేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ,  యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇద్దరు అగ్రశ్రేణి నటులు ఒకరినొకరు పోటీ పడి నటించడం సినిమాకు ప్రధాన బలం. కియారా అద్వానీ హీరోయిన్‌గా తన పాత్రలో చక్కగా నటించారు. ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకే పరిమితం కాలేదు.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ ముఖం కొద్దిగా పీక్కుపోయినట్లు ఉందని .. ఎందుకు ఇలా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ALSO READ :  ‘కూలీ’ ఫుల్ రివ్యూ..

సాంకేతిక అంశాలు
దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ స్పై యాక్షన్ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దారు. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలుస్తున్నాయి. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని  తీర్చిదిద్దారు.  ముఖ్యంగా, రైలు మీద, ఫ్లైట్ మీద జరిగే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. అయితే, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని నిరాశను వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని గ్రాఫిక్స్ పనితీరు మరింత మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

'వార్ 2' ఒక సాధారణ యాక్షన్ చిత్రం మాత్రమే కాదు. ఇది దేశభక్తి, స్నేహం, నమ్మకం, మోసం వంటి అంశాలను కలగలిపి ప్రేక్షకులను అలరిస్తుంది. కొన్ని బలహీనమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ, హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ ల అద్భుతమైన ప్రదర్శన, దర్శకుడి గ్రిప్పింగ్ టేకింగ్ ఈ సినిమాను ఒక మంచి స్పై థ్రిల్లర్‌గా నిలిపింది. ఈ సినిమా యాక్షన్ ప్రియులకు, ఈ ఇద్దరు హీరోల అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.