- కాంగ్రెస్ నుంచి కడియం ఫ్యామిలీ... బీజేపీ నుంచి ఆరూరి పోటీ
- వరంగల్ ఎంపీ స్థానంలో ఇద్దరి మధ్యే పోరు
- నిన్నటివరకూ ఇద్దరు కారు పార్టీలో కలిసే తిరిగిన్రు
- లేటుగా పార్టీ మారిన్రు..పోటాపోటీగా ప్రచారంలో దిగిన్రు
వరంగల్, వెలుగు : ఓరుగల్లు రాజకీయాల్లో గురుశిష్యులైన కడియం శ్రీహరి, ఆరూరి రమేశ్ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో చేరి, ఢీ అంటే ఢీ అంటున్నారు. నిన్నమొన్నటి వరకు కారు పార్టీలో కొనసాగిన ఈ లీడర్లు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల పోరులో ప్రత్యర్థులుగా మారారు. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ నుంచి కడియం ఫ్యామిలీకి, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్‌కు టికెట్లు దక్కాయి. కడియం శ్రీహరి వారసురాలిగా కడియం కావ్య కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు బీజేపీ నుంచి రమేశ్ పోటీ లో ఉన్నారు. దీంతో తమతమ విజయమే లక్ష్యంగా గురుశిష్యులిద్దరూ ఎన్నికల బరిలో దిగారు.
గురుశిష్యులుగా పొలిటికల్ జర్నీ
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కడియం శ్రీహరి రాజకీయాల్లో సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కడియం దాదాపు 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీగా దాదాపు అన్ని రకాల పదవులు చూశాడు. కాగా, ఇదే సామాజికవర్గం నుంచి కాంట్రాక్టర్‌గా ఉన్న ఆరూరి రమేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చాడు.
కడియం టీడీపీలో ఉన్న క్రమంలో శ్రీహరిని గురువుగా భావించాడు. అదే మర్యాద ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమం వచ్చాక.. కేసీఆర్ పెట్టిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలోకి ఇద్దరు మారారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఎస్సీ సామాజికవర్గ అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వర్ధన్నపేటపై ఆరూరి రమేశ్, స్టేషన్ ఘన్‍పూర్‍పై కడియం కాన్సంట్రేషన్ చేశారు. ఇరువురు ఇవే నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు. బీఆర్‍ఎస్ అధినేత వద్ద ఇద్దరికి సముచిత గుర్తింపు దక్కించుకున్నారు.
ఎంపీ ఎన్నికల్లో ఇరువురు ప్రత్యర్థులుగా..
ఒకే సామాజికవర్గం, ఒకే పార్టీ, ఒకే మాట అంటూ రాజకీయ ప్రయాణం చేస్తున్న కడియం, ఆరూరి మధ్య ఇప్పుడు ఢీ అంటే ఢీ అనుకునేవరకు వచ్చింది. బీఆర్‍ఎస్‍లో వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇద్దరి మధ్య వైరానికి కారణమైంది. ఈ క్రమంలో ఆరూరి రమేశ్ కారు పార్టీని వీడి బీజేపీలో చేరారు. కడియం కావ్యకు తొలుత బీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ దక్కింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. కడియం ఫ్యామిలీ కారు పార్టీ నుంచి బరిలో ఉండేందుకు నిరాకరించి, కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నిన్నమొన్నటి వరకు ఇద్దరు కావాలని అడిగిన బీఆర్‍ఎస్ ఎంపీ టిక్కెట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. తీరాచూస్తే.. ఇప్పుడు మళ్లీ అవే ఎంపీ టిక్కెట్లు ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ చేయడానికి వేదికగా నిలిచాయి. బీజేపీ తరఫున ఆరూరి.. కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం తన వారసురాలిగా బిడ్డను బరిలో ఉంచడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మారిన రాజీకీయాల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‍ఎస్ పార్టీ జనాల్లో ఆదరణ కోల్పొవడంతో కడియం కావ్య, ఆరూరి రమేశ్ రూపంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే వరంగల్ స్థానంలో అసలైన పోటీ నెలకొంది.
ఏండ్ల తరబడి బీఆర్‍ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు లేటుగా ఇతర పార్టీలో చేరారు. టిక్కెట్లు కన్‍ఫర్మ్ అవడమే ఆలస్యం ఆరూరి, బిడ్డ కోసం కడియం వరంగల్ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసి ప్రచారానికి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారు. బీఆర్‍ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ఇంకా ఎవరి పేరును ప్రకటించకపోవడంతో..ప్రచారం చేసుడు ఆగింది. మొత్తంగా గురుశిష్యులిద్దరికీ మారిన ఎన్నికల రాజకీయాలు తెలిసిని నేపథ్యంలో నియోజకవర్గాల్లో పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కారు పార్టీలో.. ఇద్దరి మధ్య కోల్డ్‌వార్
ఓరుగల్లు రాజకీయాల్లో ఏండ్ల తరబడి కడియం, ఆరూరి కలిసే ఉన్నారు. అవరసరాన్ని బట్టి ఆరూరి కడియం సలహాలు, సూచనలు తీసుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఇద్దరు గులాబి పార్టీలో కలిసే పనిచేసినా గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కడియం శ్రీహరి తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం తనను టార్గెట్ చేస్తున్నాడని ఆరూరి భావించారు. తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట సీటును కడియం తన బిడ్డకు కట్టబెట్టాలని చూస్తున్నాడని పార్టీలో గుసగుసలు వినిపించాయి.
ఈ క్రమంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి తెరవెనుక తన ఓటమికి పనిచేశాడని ఆరూరి ఆరోపించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొదట్లో ఆరూరి బీఆర్‍ఎస్ తరఫున వరంగల్ ఎంపీ టిక్కెట్ ఆశించారు. అంతలోనే కడియం శ్రీహరి తన కూతురు కావ్యను తనకు పోటీగా తీసుకువస్తున్నాడని భావించడంతో గురుశిష్యుల బంధానికి బ్రేక్ పడ్డట్లయింది.