మొహర్రం వేడుకల సందర్భంగా ఎదురుపడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వాహనాలు

 మొహర్రం వేడుకల సందర్భంగా ఎదురుపడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వాహనాలు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేతల మధ్య వార్ ముదురుతోంది. మొహర్రం వేడుకల సందర్భంగా ఖిలా వరంగల్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తలెత్తింది. మొహరం వేడుకలకు హాజరై వెళ్తుండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వాహనాలు ఎదురుపడ్డాయి. దీంతో ఎవరూ వెనక్కి తగ్గేది లేదన్నట్లు వాహనాలు ఎదురెదురుగా పెట్టుకుని ఇరువర్గాల నేతలు, కార్యకర్తలు కాసేపు హల్ చల్ చేశారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

2014లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నప్పుడు ఎమ్మెల్యే నరేందర్ వరంగల్ మేయర్ గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున నరేందర్, కాంగ్రెస్ తరపున కొండా సురేఖ ఎన్నిక బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండా సురేఖ ఎన్నిక బరిలో నిలిచే అవకాశం ఉంది.