పాలకవర్గ రాజకీయాలతో..ఆగిన వరంగల్​ బడ్జెట్‌‌ !

పాలకవర్గ రాజకీయాలతో..ఆగిన వరంగల్​ బడ్జెట్‌‌ !
  • కోడ్‌‌ రాబోతోందని తెలిసినా బడ్జెట్‌‌ పెట్టలే..
  •     ఏటా ఫిబ్రవరిలోనే  వార్షిక బడ్జెట్‌‌ సమావేశాలు
  •     రాజకీయ కారణాలతో ఈ సారి నిర్లక్ష్యం
  •     తరచూ మారుతున్న కమిషనర్లు

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‌‌ వరంగల్‌‌ కార్పొరేషన్‌‌ వార్షిక బడ్జెట్‌‌ పెట్టడంలో పాలకమండలితో పాటు, ఆఫీసర్లు విఫలం అయ్యారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలోనే బడ్జెట్‌‌ మీటింగ్‌‌ పెట్టి పద్దులపై చర్చించాల్సి ఉన్నా, ఈ సంవత్సరం పార్లమెంట్‌‌ ఎలక్షన్‌‌ కోడ్‌‌ వచ్చే అవకాశం ఉందని తెలిసినా బడ్జెట్‌‌ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్‌‌ కోడ్‌‌ పేరుతో ఆఫీసర్లే తమకు నచ్చిన లెక్కలతో బడ్జెట్‌‌ కేటాయింపులను మమ అనిపించనున్నారు.

మేయర్‌‌ కార్పొరేటర్ల మధ్య కోల్డ్‌‌ వార్‌‌

గ్రేటర్‌‌ వరంగల్‍ మేయర్‌‌గా బీఆర్‌‌ఎస్‌‌కు చెందిన గుండు సుధారాణి వ్యవహరిస్తున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఉన్నప్పుడే కార్పొరేటర్లు వరంగల్‌‌ తూర్పు, వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి సుధారాణి వ్యవహరశైలిని తప్పుపట్టారు. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడంతో మేయర్‌‌ అంటే పడనివారంతా కారును వీడి కాంగ్రెస్‌‌లో చేరిపోయారు. అదే సమయంలో సుధారాణి సైతం కాంగ్రెస్‌‌ వైపు చూడడంతో హస్తం గూటికి చేరుదామని భావించిన మరికొందరు కార్పొరేటర్లు పునరాలోచనలో పడ్డారు. సుధారాణి ఉంటే తాము పార్టీలో ఉండలేమని లోకల్‍ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పారు. సుధారాణి సైతం 20 రోజుల క్రితమే సీఎం రేవంత్‍రెడ్డిని కలిశారు. ఆమె కూడా పార్టీ మారుతోందని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకైతే బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉన్నారు. మేయర్‌‌పై గుర్రుగా ఉన్న కార్పొరేటర్లు కొన్ని రోజుల క్రితం కార్పొరేషన్‌‌లోనే మీటింగ్‌‌ పెట్టుకున్నారు. 

అభివృద్ధికి సహకరించడం లేదని, ఫండ్స్‌‌ రాకపోవడంతో డివిజన్లలో జనాల నుంచి మాటలు పడాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన గ్రామాలకు బడ్జెట్‍లో రూ.12.29 కోట్లు కేటాయించినా అందులో సగం నిధులు కూడా ఇవ్వలేదని ఆ ప్రాంత కార్పొరేటర్లు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో బడ్జెట్‌‌ మీటింగ్‌‌ పెడితే ఈ ఆంశాలపై నిలదీయాలని, అప్పటివరకు బడ్జెట్‌‌ను ఆమోదించొద్దని నిర్మయించుకున్నారు. కానీ ఈ లోగా ఎలక్షన్‌‌ కోడ్‌‌ అమల్లోకి రావడంతో బడ్జెట్‌‌ వైపు ఆలోచనే మానుకున్నారు. ప్రస్తుతం కోడ్‌‌  కారణంగా బడ్జెట్‌‌ సమావేశం నిర్వహించేందుకు వీలు లేకుండా పోయింది. ఆఫీసర్లే తమకు నచ్చిన పద్దుతో 2024–2025 బడ్జెట్‌‌ ప్రకటించనున్నారు.

నెలల వ్యవధిలోనే మారుతున్న కమిషనర్లు

గ్రేటర్‌‌ వరంగల్‌‌ కమిషనర్లు త్వరత్వరగా ట్రాన్స్‌‌ఫర్‌‌ అవుతుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కమిషనర్‌‌గా ఛార్జ్‌‌ తీసుకొని పట్టు సాధించేలోపే మళ్లీ ట్రాన్స్‌‌ఫర్‌‌ అవుతున్నారు. దీంతో కింది స్థాయి ఆఫీసర్లు, సిబ్బందిని మానిటరింగ్‌‌ చేయడంలో సమస్యలు వస్తుండగా, డెవలప్‌‌మెంట్‌‌ పనులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. గతంలో కమిషనర్లుగా వచ్చిన సర్ఫరాజ్‌‌ అహ్మద్‌‌ 20 నెలలు, శ్రుతి ఓజా 16, వీపీ గౌతం 10, రవికిరణ్‌‌ 10, పమేలా సత్పతి 18, ప్రావీణ్య 20, రిజ్వాన్‌‌ బాషా 9 నెలలకే ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యారు. దీంతో ఇన్‌‌చార్జులమీదే పాలన నడుస్తోంది. 

మార్చి దాటుతున్నా బడ్జెట్‌‌ ఆలోచనే చేయట్లే..

ప్రతి ఏటా ఫిబ్రవరి 22న గ్రేటర్‌‌ వరంగల్‌‌ బడ్జెట్‌‌ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కోసారి రెండు, మూడు రోజులు అటు ఇటు అవుతుంది. ఈ సారి మార్చి 18 దాటినా, మరో 10 రోజుల్లో ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ ముగుస్తున్నా ఇప్పటివరకు బడ్జెట్‌‌ గురించి ఆలోచనే చేయడం లేదు. గతంలో గ్రేటర్‌‌ కమిషనర్‌‌గా ఉన్న రిజ్వాన్‌‌ బాషా ఫిబ్రవరి 9 నుంచి 22 వరకు సెలవుపై వెళ్లారు. ఈ టైంలో ఇన్‌‌చార్జ్‌‌గా వరంగల్‌‌ కలెక్టర్‌‌ వ్యవహరించారు. రిజ్వాన్‌‌ బాషా వచ్చాక ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి ఫిబ్రవరి 29న బడ్జెట్‍ మీటింగ్‌‌ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బడ్జెట్‌‌ కూర్పునకు కావాల్సిన ఏర్పాట్లు చేయించారు. సొంత ఆదాయం పెంచుకుని, కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లను తగ్గించేలా బడ్జెట్‌‌ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. కానీ 23వ తేదీనే ఆయన జనగామ కలెక్టర్‌‌గా ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యారు. మేయర్‌‌తో పాటు ఆఫీసర్లు ఎవరూ బడ్జెట్‌‌ సమావేశాలు నిర్వహించే ఆలోచన చేయలేదు. వరంగల్‌‌ అడిషనల్‌‌ కలెక్టర్‌‌గా ఉన్న అశ్విని తానాజీ వాఖడే మార్చి 14న గ్రేటర్‌‌ ఫుల్‌‌ టైం కమిషనర్‌‌గా ఛార్జ్‌‌ తీసుకున్నారు. తర్వాత రెండు రోజులకే ఎలక్షన్‌‌ కోడ్‌‌ అమల్లోకి వచ్చింది.

పేపర్లు, టెండర్ల దశలోనే పనులు

గ్రేటర్‌‌ వరంగల్‌‌ 406 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా 66 డివిజన్లు, 11 లక్షలకుపైగా జనాభా ఉంది. వర్షాకాలంలో వందలాది కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. అన్ని డివిజన్లలో మౌలిక సమస్యలు పేరుకుపోయాయి. నాలాల అభివృద్ధితో పాటు జనరల్‌‌ ఫండ్స్‌‌, సీఎం రిలీఫ్‍, స్మార్ట్‌‌ సిటీ నిధులతో చేపట్టాల్సిన వేలాది కోట్ల పనులు పేపర్లు, టెండర్ల దశలోనే ఆగిపోయాయి. గతంలో కేటీఆర్‌‌ వచ్చిన టైంలో రూ.2 వేల కోట్లకు తగ్గకుండా పనులకు శిలాఫలకాలు వేశారు. 2021 గ్రేటర్‌‌ ఎలక్షన్ల టైంలో చేసిన శంకుస్థాపనలకే ఇంకా మోక్షం లేకపోగా.. ఎన్నికల పేరుతో మరికొన్ని శిలాఫలకాలు వేశారు తప్పితే ఫండ్స్‌‌ మాత్రం కేటాయించలేదు. దీంతో ఎంతో ప్రాధాన్యం కలిగిన పనులు సైతం పెండింగ్‌‌లోనే పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడ్డ గ్రేటర్‌‌ 2022 - 2023, 2023- 2024 వార్షిక బడ్జెట్‌‌లో నిధులను చూపెట్టడం తప్పించి అవి వచ్చిన దాఖలాలేవీ లేవు. 2023-24లో రూ.612.29 కోట్లతో బడ్జెట్‌‌ ప్రవేశపెట్టారు. ఇందులో సొంత ఆదాయం రూ.213.63 కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల రూపంలో రూ.394 కోట్లు వస్తాయని అంచనా వేశారు. తీరా చూస్తే ఆర్థికసంవత్సరం ముగుస్తున్నా నిధులు మాత్రం రాలేదు.