మురుగు చెరువులు! ..వరంగల్ సిటీ చెరువులు కాలుష్యమయం

మురుగు చెరువులు! ..వరంగల్ సిటీ చెరువులు కాలుష్యమయం
  • క్లీన్ చేసే వ్యవస్థలేక నేరుగా చేరుతోన్న డ్రైనేజీ నీరు  
  • సరిపడా ఎస్టీపీలు లేకపోవడంతో కలుషితమవుతోన్న జలవనరులు
  • స్మార్ట్ సిటీగా ఎంపికైన నేపథ్యంలో ఎస్టీపీలకు ప్రతిపాదనలు
  • నిర్మాణాలను లైట్ తీసుకుంటున్న గ్రేటర్ మున్సిపల్ ఆఫీసర్లు  

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు మురుగుమయంగా మారుతున్నాయి.  కాలనీల డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేందుకు ఎలాంటి వ్యవస్థ లేకపోవడంతో నేరుగా చెరువుల్లోకే చేరుతోంది. దీంతో సిటీలోని జల వనరులు కలుషితమవుతున్నాయి. చెరువులు కాలుష్యం బారిన పడకుండా సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీ)లు నిర్మించేందుకు గతంలో ఆఫీసర్లు ప్రపోజల్స్ రూపొందించారు. కానీ వాటి నిర్మాణానికి స్థల సేకరణపై నిర్లక్ష్యంగా ఉంటుండడంతో ఎస్టీపీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  

రోజూ 120 ఎంఎల్డీ మురుగు బయటకు..

 కార్పొరేషన్ పరిధి 66 డివిజన్లలో 1,500కుపైగా కాలనీలు ఉన్నాయి. దాదాపు 2.25 లక్షల ఇండ్లు ఉండగా.. 11 లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నారు. సిటీలో 60 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1,500 కి.మీ డ్రైన్లు, 400 కి.మీ కచ్చా డ్రైన్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాలనీల నుంచి  120 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే) మురుగు బయటకు వచ్చి చెరువుల్లో కలుస్తోంది. వచ్చే మురుగు నీటిని లెక్క గట్టి అందుకు అవసరమైన ఎస్టీపీలు నిర్మించాల్సి ఉంది. కానీ, సరిగా ఎస్టీపీలు లేకపోవడంతో మురుగు నేరుగా చెరువుల్లోకే వెళ్తోంది. 

కలుషితమవుతున్న చెరువులు

సిటీలో మురుగు శుద్ధికి సరైన వ్యవస్థ లేని కారణంగా కాలనీల డ్రైనేజీ నీరంతా నాలాల ద్వారా చెరువుల్లో కలుస్తోంది. దీంతో గుర్రపు డెక్క పెరుగుతుండడంతో పాటు చెత్తాచెదారంతో కలుషితంగా మారుతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.వంద కోట్లతో డెవలప్ చేస్తున్న భద్రకాళి చెరువు కూడా జూపార్కు, హంటర్ రోడ్డు, బొందివాగు నాలా నుంచి వచ్చే మురుగునీటితో నిండిపోతోంది. చిన్నవడ్డేపల్లి చెరువు, గోపాలపూర్ ఊర చెరువు, బంధం చెరువుతో పాటు మిగతా వాటి పరిస్థితి కూడా ఇలానే ఉంది.  వరద నీటితో పాటు నాలాల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని నాగారం చెరువులోకి మళ్లిస్తుండడంతో కలుషితమవుతోంది. గతంలో నాగారం చెరువు చేపలంటే జనాలు ఇష్టంగా తినేవారు. ఇప్పుడా చెరువు కలుషితమవగా అందులోని చేపలు కొనుగోలుకు కూడా జనాలు ఆసక్తి చూపడం లేదు. ఇకనైనా సిటీలోని ప్రధాన చెరువులు మురుగు బారిన పడకుండా, శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు గ్రేటర్ కార్పొరేషన్ ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని సిటీవాసులు డిమాండ్ చేస్తున్నారు. 


రెడ్డిపురం వద్ద నిర్మించాల్సి ఉండగా.. 

స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికైనందున సిటీలో ఎస్టీపీల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా రూ.2.7 కోట్లతో 750 కేఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మించారు. ఆ తర్వాత రంగ సముద్రం ఉర్సుగుట్ట వద్ద 5 ఎంఎల్డీ,  కాజీపేట బంధం చెరువు ప్రగతినగర్ వద్ద 15 ఎంఎల్డీ కెపాసిటీతో రెండు ఎస్టీపీలను నిర్మించారు.

 ప్రస్తుతం ఇవి సిటీ అవసరాలకు సరిపోవడంలేదు. సిటీ పైనుంచి వచ్చే మురుగు కూడా నాగారం పెద్ద చెరువులోకి వెళ్తోంది. దీంతో దాదాపు రూ.200 కోట్లతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్డీ సామర్థ్యంతో మెగా ఎస్టీపీ నిర్మా ణానికి ఆఫీసర్లు కసరత్తు చేశారు. ఇందుకు 14.26 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా.. భూసేకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికుల అభ్యంతరం చెబుతూ ఆందోళనకు దిగడంతో ప్రాజెక్టును పక్కన పెట్టారు.