- ఎంపీ ఎన్నికల్లో హాట్‌టాపిక్‌గా మారనున్న అంశం
- ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న జిల్లా వాసులు
మహబూబాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల వేళ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం మరోసారి తెరపైకి వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి మహబూబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఇనుప రాయి గనులున్న ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడడంలేదు. ‘బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు’ అని అన్ని పార్టీలు కొన్నేండ్ల నుంచి నుంచి ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణ మాత్రం శూన్యమే అని చెప్పాలి.
గతంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో బయ్యారంలో ఉక్కుపరిశ్రమ సాధ్యం కాదని ప్రకటించడంతో మహబూబాద్ జిల్లాతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేంద్రం పరిశ్రమను స్థాపించకపోతే, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్, కేటీఆర్ పలు సమావేశాల్లో ప్రకటించినప్పటికీ పరిశ్రమ ఏర్పాటుకు నోచుకోలేదు.
పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలతలు అనేకం..
బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. పరిశ్రమకు అవసరమైన బొగ్గు ప్రస్తుత ప్రతిపాదిత పరిశ్రమ నిర్మాణ స్థలానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో లభ్యమవుతుండగా, నీరు బయ్యారం పెద్ద చెరువు ద్వారా అందుబాటులో ఉంటుంది. ధర్మాపురానికి 8 కి.మీ దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాదారంలో లభ్యం అవుతున్నాయి.
రవాణా పరంగా ఇల్లందు ప్రధాన రహదారి పక్కన ఉన్న ధర్మారం ఉండగా, ఈ రహదారి త్వరలో నేష్నల్ హైవే మారనుంది. ఇక్కడకు 10 కి.మీ దూరంలో గార్ల రైల్వే స్టేషన్, 15 కి.మీ దూరంలో గుండ్రాతిమడుగు డోర్నకల్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థల సర్వేల్లో పూర్తి రాష్ట్ర పునర్విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మిస్తామని, అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్అధికారంలోకి వచ్చాక, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజికల్ అధికారులు ఉమ్మడిగా సర్వే చేశారు.
ఆ తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) అధికారులు బయ్యారంలో పరిశ్రమ నిర్మాణం పై సర్వే చేశారు. ఈ సర్వే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ద్వారా బయ్యారం ఇనుప రాయి గుట్టపై డ్రిల్లింగ్ నిర్వహించి ఉక్కు నాణ్యతను తెలుసుకున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ మెకాన్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని ఉక్కు పరిశ్రమ నిర్మాణం అనువైన స్థలంపై సర్వే చేశారు.
సర్వేకు వచ్చిన మెకానిక్ బృందంలో బయ్యారం వనరులు అందుబాటులో ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అన్ని సర్వేలు ముగిసిన తర్వాత బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు మేరకు బయ్యారంలో పరిశ్రమ నిర్మించాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సమాధానంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. స్థానికంగా నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్రం బయ్యారం ఉక్కుపై సర్వే కొనసాగుతుందని ప్రకటించింది.
ఎన్నికల ప్రచార అస్త్రంగానే ఉక్కు పరిశ్రమ..
గత ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మిస్తామని ప్రచార అస్త్రంగా మార్చి వాగ్దానంగా ప్రకటించాయి. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి నాడు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి టి.వీరభద్రం పరిశ్రమ కోసం పాదయాత్రలు నిర్వహించారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల వేళ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ మళ్లీ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుంది.
నాణ్యత పై అనుమానాలేనా.!
బయ్యారంలో విస్తారమైన ఖనిజ నిక్షేపాలున్నా నాణ్యత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు నిర్వహించిన మెకాన్ సంస్థ ప్రతినిధులు కేంద్రానికి ఉక్కు నాణ్యత పై ఎలాంటి నివేదిక ఇచ్చారనేది ఆసక్తి కరంగా మారింది. నాణ్యమైన ఉక్కు ఉందని కొందరు, లేదని మరి కొందరు వాదిస్తున్నారు. సాంకేతిక అంశాల పై నోరు విప్పడానికి అధికారులు సిద్ధపడడం లేదు. కాగా, రెవెన్యూ అధికారులు మాత్రం పరిశ్రమ ఏర్పాటు కోసం 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు.