
- నిలిచిపోయిన గ్రేటర్ వరంగల్ వెజ్ అండ్ నాన్‍వెజ్ మార్కెట్ల నిర్మాణాలు
- జీడబ్ల్యూఎంసీ ఎన్నికల స్టంట్‍గా 2021లో కేటీఆర్ శిలాఫలకాలు
- 6 నెలల్లో పూర్తిచేసి చిరువ్యాపారులకు ఇస్తామని ఎన్నికల ప్రచారం
- రూ.40 కోట్ల పనులకు రూ. 9 కోట్ల కేటాయింపు
- స్లాబులు వేయక నాలుగేండ్లుగా ఎండావానలకు తుప్పుపట్టిన సలాకలు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లో దాదాపు నాలుగున్నరేండ్ల కింద బీఆర్ఎస్ నేతలు ముగ్గుపోసిన వెజ్అండ్ నాన్‍వెజ్ మార్కెట్ల పనులు అటకెక్కాయి.రెండు రోజుల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ వస్తుందనగా సిటీ , చిరువ్యాపార ఓటర్లను ఆకట్టుకునేందుకు లక్ష్యంగా నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వరంగల్ సిటీకి వచ్చి హడావిడిగా అయిదు మార్కెట్లకు శిలాఫలకాలు వేశారు.
6 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేసి రోడ్లపై వ్యాపారాలు చేసుకునేవారిని ఆదుకుంటామని మాటిచ్చారు రెండున్నరేండ్ల తర్వాత వారు అధికారం కోల్పోయే నాటికి కూడా మార్కెట్ పనులు పూర్తి కాకపోగా.. వదిలేసిన నిర్మాణాల్లో ఎండావానలకు సలాకలు తుప్పుపడుతున్నాయి.
గ్రేటర్ ఎలక్షన్లకు రెండ్రోజుల ముందు..
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మిపురం ఫ్రూట్ మార్కెట్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హనుమకొండ రాంనగర్ ఐబీ గెస్ట్ హౌజ్ వద్ద మార్కెట్‌తో పాటు కాజీపేట ఓల్డ్ మార్కెట్, కరీంనగర్ రోడ్డులోని చింతగట్టు కెనాల్ వద్ద, రంగశాయిపేటలో మొత్తంగా ఐదు మార్కెట్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రెండ్రోజుల ముందు.. నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్2021 ఏప్రిల్12న వరంగల్లో పర్యటించి వరంగల్ లక్ష్మిపురం, హనుమకొండ ఐబీ గెస్ట్ హౌజ్, రంగశాయిపేటలో మార్కెట్ల నిర్మాణానికి శిలాఫలకాలు వేశారు.
మొదట్లో.. లక్ష్మిపురం మార్కెట్లో వెజ్అండ్ నాన్‍వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్ల నిర్మాణానికి రూ.24 కోట్లు, ఐబీ గెస్ట్ హౌజ్ మార్కెట్‍కు రూ.9 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఐదారు నెలల్లోనే వీటిని జనాలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రచారం చేశారు.
మాటలు చెప్పి.. పావు వంతు బడ్జెట్ఇయ్యలే
ప్రధాన మార్కెట్లుగా భావించే వరంగల్ లక్ష్మిపురం మార్కెట్ పూర్తి పనులయ్యేనాటికి దాదాపు రూ.30కోట్లు, హనుమకొండలోని ఐబీ గెస్ట్ హౌజ్ వద్ద వెజ్అండ్ నాన్‍వెజ్ మార్కెట్‍కు రూ.10 కోట్లు అవుతాయని అధికారులు భావించారు. రూ.40 కోట్లతో చేపట్టాల్సిన రెండు మార్కెట్ల పనులకు నాటి మంత్రిగా కేటీఆర్ రూ.4.5 కోట్ల చొప్పున కేవలం రూ.9 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆపై మిగతా ఫండ్స్ ఇవ్వడం ఆపేశారు. దీంతో ఐదారు నెలల్లో పూర్తి చేస్తామన్న పనులు బడ్జెట్ లేక 2023 డిసెంబర్‌లో బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయేవరకు పిల్లర్లు, స్లాబ్ దశ వరకే ఆగిపోయాయి.
గ్రేటర్ రోడ్లపై.. చిరువ్యాపారుల గోస
నాలుగేండ్లుగా పిల్లర్ల దశకు చేరుకున్న నిర్మాణాల్లోని ఐరన్ రాడ్లు తుప్పుపట్టాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. నిర్మాణ స్థలాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. గ్రేటర్ వరంగల్, హనుమకొండ రోడ్లన్నీ ఎక్కడపడితే అక్కడ చిరువ్యాపారాలతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో పోలీసులు రోడ్లపై చిరువ్యాపారాలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రేటర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో.. కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలను పూర్తిచేసి తమను ఆదుకోవాలని చిరువ్యాపారులు
కోరుతున్నారు.
పనులు.. నేను చేయిస్తా
బీఆర్‍ఎస్ ప్రభుత్వం అంటేనే శిలాఫలకాల ప్రభుత్వం. 2021 ఏడాదిలో గ్రేటర్ ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి.. రెండ్రోజుల ముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పేరుతో కేటీఆర్ శిలాఫలకాలు వేశారు. 6 నెలల్లో పనులు చేస్తానని చెప్పి.. 3 ఏండ్లు గడిచినా పనులకు కావాల్సిన ఫండ్స్ ఇవ్వకుండా నమ్మిన ప్రజలను మోసం చేశారు. వారు చేయలేని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను నేను పూర్తి చేయిస్తా. త్వరలోనే ఫండ్స్ తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తా.- నాయిని రాజేందర్‍రెడ్డి (వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే)