గ్రేటర్ వరంగల్, వెలుగు: కాకతీయుల వైభవానికి ప్రతీకైన ఓరుగల్లు గడ్డపై క్రీడా రంగంలో కొత్త చరిత్రకు గురువారం శ్రీకారం చుట్టారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ‘మీట్ యువర్ వరంగల్ వారియర్స్’ కార్యక్రమంలో ‘టీజీ-20 క్రికెట్ లీగ్’కు సంబంధించిన షెడ్యుల్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ లీగ్‌లో వరంగల్ జట్టు భాగస్వామ్యం కానుంది.
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. కేవలం విజయాలకే పరిమితం కాకుండా, తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి చేర్చడం, వరంగల్‌లో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఫ్రాంచైజీ సహ యజమానులు వరుణ్ జూపల్లి, ఫణి చిట్నేని, ధీరజ్ పాల్గొన్నారు.
