
Berkshire Shares: ప్రపంచ కుబేరుల్లో ఒకరు వారెన్ బఫెట్. లక్షల కోట్ల సంపాదన ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికీ సింపుల్ లైఫ్ స్టైల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనేక దశాబ్ధాల నుంచి ఒకే ఇంటిలో ఉంటూ బేసిక్ ఎమినిటీస్ వాడుతూ ఇతర సంపన్నులకు భిన్నంగా ఉండటం ఆయన ప్రత్యేకత.
అయితే తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన 6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 50వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను గేట్స్ ఫౌండేషన్ తో పాటు మరో నాలుగు కుటుంబ ఛారిటీ సంస్థలకు విరాళంగా ఇస్తు్న్నట్లు ప్రకటించారు. గతంలో కూడా వారెన్ బఫెట్ పలుమార్లు ఇలా పెద్ద విరాళాలను అందించిన సంగతి తెలిసిందే.
బఫెట్ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు వార్షికంగా అందించిన అతిపెద్ద విరాళంగా ఇది నిలిచింది. దీని ద్వారా గేట్స్ ఫౌండేషన్‌కు 9.43 మిలియన్ షేర్లు, సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 9,43,384 షేర్లు.. పిల్లలు హోవార్డ్, సూసీ, పీటర్ నిర్వహిస్తున్న మూడు ఛారిటీలకు 6,60,366 షేర్లను బఫెట్ అందించారు. దీని తర్వాత కూడా వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ సంస్థలో 13.8 శాతం వాటాలను కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
విరాళాలను ప్రకటించటానికి ముందు బిలియనీర్ బఫెట్ నికర విలువ శుక్రవారం 152 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ నివేదించింది. అయితే ప్రస్తుతం విరాళాల తర్వాత సంపద తగ్గటంతో బఫెట్ ప్రపంచ కుబేరుల జాబితాలో 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయారు. 94 ఏళ్ల బఫెట్ దాదాపు 20 ఏళ్ల నుంచి తన దాతృత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే తన మరణం తర్వాత మిగిలిన సంపదలో 99.5% తన పిల్లల పర్యవేక్షణలో ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెందాలని నిర్ణయించారు.